శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 31 మార్చి 2017 (06:40 IST)

కనీ వినీ ఎరుగని రాయితీలు..ఒక్క టూవీలర్‌కు రూ. 22 వేలు తగ్గింపు

సుప్రీంకోర్టు తీర్పు దెబ్బకు తమ వద్ద ఉన్న బిఎస్ త్రీ ప్రమాణం కలిగిన టూవీలర్లను కారుచౌక ధరలకు అమ్మివేయడానికి మోటారు వాహనాల తయారీ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఈ అవకాశం ఈ ఒక్కరోజు మాత్రమే కావడంతో మంచితరుణం మించిన దొరకదు రండోయ్.. రారండోయ్ అంటూ దిగ్గజ కంప

ఒక్కరోజు ముఖ్యమంత్రి పాలన ఎంత స్పీడుగా, ఎంత ప్రజానుకూలంగా ఉంటుందో మనం సీనిమాల్లో చాలానే చూశాం. కానీ సుప్రీంకోర్టు తీర్పు దెబ్బకు తమ వద్ద ఉన్న బిఎస్ త్రీ ప్రమాణం కలిగిన టూవీలర్లను కారుచౌక ధరలకు అమ్మివేయడానికి మోటారు వాహనాల తయారీ కంపెనీలు క్యూ కడుతున్నాయి.  ఈ అవకాశం ఈ ఒక్కరోజు మాత్రమే కావడంతో  మంచితరుణం మించిన దొరకదు రండోయ్.. రారండోయ్ అంటూ దిగ్గజ కంపెనీలు సైతం టముకు వాయించడం గమనార్హం.
 
బీఎస్‌ – 3 కాలుష్య ప్రమాణాలతో ఉన్న వాహనాలను ఏప్రిల్‌ 1 నుంచి విక్రయించడం, రిజిస్ట్రేషన్‌ కుదరదని సుప్రీంకోర్టు బుధవారం సంచలన తీర్పు ఇవ్వడంతో అలాంటి వాహన నిల్వలను వదిలించుకోవడానికి వాహన తయారీ కంపెనీలు పరుగులు పెడుతున్నాయి. ద్విచక్ర వాహనాలపై రూ.22వేల రూపాయల వరకు తగ్గింపును పొందే అవకాశం, అదీ శుక్రవారం ఒక్కరోజే అందుబాటులో ఉండటంతో వినియోగదారులు పండగ చేసుకుంటున్నట్లే. సుప్రీంకోర్టు తీర్పుతో హోండా, హీరో, బజాజ్, సుజుకి వంటి పెద్ద కంపెనీలన్నీ తగ్గింపు ఆఫర్లు ప్రకటించాయి. మార్చి 31 తర్వాత బీఎస్-3 వాహనాల అమ్మకాలు, ఉత్పత్తి మొత్తం బంద్ కానుంది. అందుకే స్కూటర్, బైక్‌ ఏదైనా ద్విచక్ర వాహనాన్ని కొనాలన్న ఆలోచన ఉంటే ఆ ముహూర్తమేదో ఈ రోజే పెట్టేసుకోండి అంటూ వాహన తయారీ కంపెనీలు రారమ్మని, రారా రమ్మని వినియోగదారులను ఆహ్వానిస్తున్నాయి. 
 
దేశంలో అన్ని రకాల కార్లను కంపెనీలు బీఎస్-4 ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేస్తుండగా, ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, ట్రక్కులు, బస్సులే బీఎస్‌ –3 ప్రమాణాలకు అనుగుణంగా ప్రస్తుతం విక్రయమవుతున్నాయి. బీఎస్‌ – 3 ప్రమాణాలతో ఉన్న అన్ని రకాల వాహనాలు దేశంలో 8 లక్షలకు పైన ఉంటాయని అంచనా. వీటిలో కేవలం ద్విచక్ర వాహనాలే 6.71 లక్షలు ఉన్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు దరిమిలా ఆఖరి రోజైన మార్చి 31లోపు వీలైనన్నింటినీ విక్రయించుకోవాలన్న ఉద్దేశంతో కంపెనీలు భారీ డిస్కౌంట్లను ప్రకటించినట్టు పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. 
 
పది వేలనుంచి 22 వేల రూపాయల వరకు బీఎస్‌–3 ద్విచక్ర వాహనాలపై కనీవినీ ఎరుగని రీతిలో భారీ డిస్కౌంట్లు ఇస్తుండటంతో అమ్మకాలు బాగా పెరిగే అవకాశాలున్నట్లు డీలర్లు చెబుతున్నారు. హైదరాబాద్‌లో ఒక్కో డీలర్‌ వద్ద 200–300 దాకా వాహనాలు ఉండగా, భారీ డిస్కౌంట్ల కారణంగా ఇవన్నీ ఒక్కరోజులో అమ్ముడయిపోతాయని డీలర్లు చెబుతుండటం విశేషం. అయితే ఒక్కొక్క వాహన తయారీ సంస్థ వద్ద 30 వేల నుంచి 2 లక్షల వరకు బీఎస్-3 వాహనాలు ఉండటంతో ఒక్కరోజులో ఇవన్నీ అమ్ముడవుతాయా అనేది సందేహమే.
 
మొత్తం మీద ఒక్క రోజు వినియోగదారుడు సుప్రీంకోర్టు తీర్పు వల్ల పండగ చేసుకోవడం మాత్రం ఖాయం.