బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 28 నవంబరు 2015 (17:08 IST)

కోకాకోలా కంపెనీ మాకొద్దు.. తరిమికొట్టండి: మోడీ నియోజక వర్గ ప్రజలు

భూగర్భ జలాలు అడుగంటిపోయి చుక్కనీటి కోసం అల్లాడిపోతున్న యూపీలోని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నియోజకవర్గమైన వారణాసి జిల్లా మెహదీగంజ్ వాసులు కోకాకోలాపై నిరసనగళమెత్తారు. కోకాకోలా కంపెనీతో తమ ప్రాంతంలోని భూగర్భ జలాలు ఎండిపోయి నీటి కోసం నానా తంటాలు పడుతున్నామని.. అందుకే వెంటనే ఆ కంపెనీని వెళ్లగొట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా మొత్తం 18 గ్రామాలకు చెందిన ప్రజలంతా ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని కంపెనీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. 
 
1999లో కంపెనీ ప్లాంట్ ప్రారంభమైనప్పటి నుంచి తమకు తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోలా తయారీ కోసం భూమిలోంచి నీటిని విపరీతంగా తోడేస్తుండడం వలన పేదలు, రైతులు, పిల్లలు, నీటిపై ఆధారపడే ఇతర జీవరాసులు నీరు లేక ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై కోకాకోలా ప్లాంట్‌కు అనుమతి ఇచ్చిన రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డుకు కౌన్సిల్ లేఖ రాసిందని గ్రామస్తులకు మద్దతిస్తున్న కాలిఫోర్నియాకు చెందిన ఇండియా రిసోర్స్ సెంటర్‌కు చెందిన శ్రీవాస్తవ అన్నారు.