గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 14 మే 2015 (14:57 IST)

యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్... ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో మార్పు లేదు!

యూనియన్ పబ్లిక్ సర్వీస్ పరీక్షల్లో (యూపీఎస్సీ) ఎలాంటి మార్పులూ ఉండబోవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రిలిమ్స్‌లో సహజసామర్థ్య పరీక్ష (సీశాట్) యధాతధంగా కొనసాగుతుందని కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యహారాల విభాగం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, ఈ పరీక్షపై సమగ్ర అధ్యయనం కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. 
 
సహజసామర్థ్య పరీక్ష అర్హత, సిలబస్, విధానంపై తరుచూ ప్రశ్నలు ఎదురవుతున్నందున ఈ పరీక్షను కమిటీ సమగ్రంగా పరిశీలిస్తుందని వెల్లడించింది. కమిటీ ఇచ్చే నివేదికపై ప్రభుత్వం నిర్ణయం తీసుకొనేవరకు ప్రిలిమ్స్‌లో 33 శాతం పాస్ మార్కులతో జనరల్ స్టడీస్ పేపర్-2 (సీశాట్) అర్హత పరీక్షగా కొనసాగుతుంది. 
 
ఆ పరీక్షలో ఇంగ్లీష్ భాగం కూడా కొనసాగుతుంది అని డీవోపీటీ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పరీక్షలోని ఇంగ్లీష్ విభాగంలో తప్పనిసరిగా అర్హత సాధించాలన్న నిబంధనతో గ్రామీణప్రాంతాల అభ్యర్థులకు సివిల్‌సర్వీస్ అందని ద్రాక్షగా మారే ప్రమాదముందంటూ గతేడాది జూలైలో అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. దాంతో 2014లో సీశాట్‌లో ఇంగ్లీష్ మార్కులను మినహాయించి పరీక్షలు నిర్వహించిన విషయం తెల్సిందే. ఇదే విధానాన్ని ఈ యేడాది కొనసాగించనున్నట్టు తెలిపింది.