గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. అవకాశాలు
Written By మోహన్
Last Updated : గురువారం, 25 ఏప్రియల్ 2019 (18:21 IST)

ఇండియన్ ఆర్మీ సంచలన నిర్ణయం.. ఏంటది?

ఇండియన్ ఆర్మీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్మీలో సేవలు అందించేందుకు స్త్రీలకు ఆహ్వానం పలుకుతూ ఇండియన్ ఆర్మీ వారికి అవకాశం కల్పించనుంది. జవాన్లుగా మహిళలు కూడా సేవలందించేందుకు అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.


మొదటి దశలో సైన్యంలో 100 మంది మహిళా సైనికుల నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 25 నుంచి జూన్ 8లోపు ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది.
 
ఇప్పటి వరకు మహిళలు ఆర్మీలో మెడికల్, లీగల్, ఎడ్యుకేషనల్, సిగ్నల్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగాల్లోనే పని చేస్తున్నారు. కాగా మహిళలకు కూడా క్షేత్రస్థాయిలో జవాన్లుగా పని చేసే అవకాశం కల్పించాలని డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈ డిమాండ్‌ను అటు భారత సైన్యం, ఇటు కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నాయి. 
 
సుదీర్ఘ చర్చల తర్వాత మహిళలకు కూడా జవాన్లుగా అవకాశం కల్పించాలని ఈ ఏడాది ప్రారంభంలో నిర్ణయం తీసుకున్నారు. మిలిటరీ పోలీసు విభాగంలో 20 శాతం వరకు మహిళలను తీసుకోవాలని నిర్ణయించారు. క్రైమ్ కేసుల విచారణ నుంచి ఆర్మీ ఫీల్డ్ ఆపరేషన్‌ల వరకు మహిళా జవాన్ల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించారు.
 
దేశవ్యాప్తంగా కొన్ని ప్రముఖ నగరాల్లో వీటికి సంబంధించిన రిక్రూట్‌మెంట్ ర్యాలీలను నిర్వహిస్తారు. అందులో ప్రముఖంగా అంబాలా, లక్నో, జబల్‌పూర్, బెంగళూరు, షిల్లాంగ్‌ పట్టణాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. కామన్ ఎంట్రన్స్ పరీక్ష ద్వారా రాతపరీక్షను నిర్వహిస్తారు. పరీక్షలో ఎంపికైన అభ్యర్థులు రిక్రూట్‌మెంట్ ర్యాలీల్లో వైద్య పరీక్షల నిమిత్తం హాజరు కావాల్సి ఉంటుంది. రాతపరీక్షకు సంబంధించిన ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారని అధికారులు తెలిపారు.
 
మహిళా సైనికుల గరిష్ట వయోపరిమితి 21 సంవత్సరాలు. కనీస వయస్సు 17.5 సంవత్సరాలు. అయితే విధి నిర్వహణలో అమరులైన రక్షణ సిబ్బంది జీవిత భాగస్వాములకు గరిష్ట వయోపరిమితిని 30 సంవత్సరాల వరకూ సడలించారు.