బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 21 మార్చి 2017 (03:52 IST)

శశికళ వర్గానికి ఎదురు తిరుగుతున్న ఆర్కేనగర్... కార్యకర్తల జంప్‌తో దినకరన్ కలవరం

ఆర్కేనగర్‌ రేసులో దిగిన అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ లో అప్పుడే కలవరం బయల్దేరింది. ఇందుకు కారణం, తన కోసం రంగంలోకి దిగి పనిచేసే ఆర్కేనగర్‌కు చెందిన స్థానిక నాయకులు ఒక్కొక్కరుగా పన్నీరు శిబిరం వైపుగా జంప్‌ అవుతోండడమే.

ఆర్కేనగర్‌ రేసులో దిగిన అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ లో అప్పుడే కలవరం బయల్దేరింది. ఇందుకు కారణం, తన కోసం రంగంలోకి దిగి పనిచేసే ఆర్కేనగర్‌కు చెందిన  స్థానిక నాయకులు ఒక్కొక్కరుగా పన్నీరు శిబిరం వైపుగా జంప్‌ అవుతోండడమే. అమ్మ జయలలిత మరణంతో ఖాళీగా ఉన్న ఆర్కేనగర్‌ నియోజకవర్గంలో ఉప ఎన్నికల సందడి రాజుకున్న విషయం తెలిసిందే. ఈ సీటును కైవసం చేసుకునేందుకు ఓ వైపు డీఎంకే తీవ్రంగానే ప్రయత్నాలు, వ్యూహ రచనల్లో నిమగ్నమైంది. అన్నాడీఎంకేలో 
 
సాగుతున్న కుమ్ములాటల నేపథ్యంలో తమ సిట్టింగ్‌ స్థానం మళ్లీ ఖాతాలో పడేనా అన్న ఉత్కంఠ ఆ పార్టీ వర్గాల్లో బయల్దేరింది. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళ శిబిరానికి చెందిన ఆ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్  స్వయంగా రేసులో దిగారు. ఆయన్ను ఢీ కొట్టేందుకు మాజీ సీఎం పన్నీరు శిబిరంలో బలమైన వ్యక్తిగా మధుసూదనన్  బరిలో ఉన్నారు.
 
అన్నాడీఎంకే ఓట్లను చీల్చేందుకు జయలలిత మేన కోడలు దీప సిద్ధం అవుతున్నారు. ఈ పరిణామాలు తమకు కలిసి వచ్చే అంశంగా డీఎంకే వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఓట్లు చీలకుండా, అధికార బలాన్ని అడ్డం పెట్టుకుని తన గెలుపు లక్ష్యంగా ముందుకు సాగేందుకు టీటీవీ వ్యూహ రచనల్లో ఉన్నట్టు సంకేతాలు ఉన్నాయి. ఇందుకు తగ్గట్టుగా దీప కుటుంబంలో చిచ్చు రగిల్చారని చెప్పవచ్చు. అయితే అసలు చిక్కు అంతా మధుసూదనన్  రూపంలో దినకరన్ కు ముచ్చెమటలు పట్టే అవకాశాలు ఎక్కువే.
 
దినకరన్ లో కలవరం మధుసూదనన్  దివంగత ఎంజీయార్‌ కాలం నుంచి ఆర్కేనగర్‌ ఓటర్లకు సుపరిచితుడే. గతంలో ఓ మారు ఇక్కడి నుంచే ఆయన అసెంబ్లీ మెట్లు ఎక్కారు. నియోజకవర్గంలో ప్రతి వీధి, ప్రతి నాయకుడితో సంబంధాలు ఉండడం మధుసూదనన్ కు కలిసి వచ్చే అంశం. ముందుగా ఆయన ఆ నియోజకవర్గంలోని నాయకుల్ని గురి పెట్టి వారి ఇంటి గడప తొక్కి వస్తున్నారు. దీంతో స్థానికంగా ఎన్నికల బరిలో దిగి పనిచేసే ముఖ్య నాయకులు అనేక మంది మధుసూదనన్ కు మద్దతుగా పన్నీరు శిబిరం వైపుగా కదులుతుండడం టీటీవీ దినకరన్ ను కలవరంలో పడేసింది.
 
స్థానికంగా ఉన్న రాజేష్, జనార్దన్, అంజులక్ష్మి, లలిత, శశి వంటి నాయకులు పన్నీరు వైపుగా వెళ్లినా, కార్యకర్తలు మాత్రం తనకు అండగా ఉంటారన్న ఎదురు చూపుల్లో దినకరన్  ఉన్నారు. ఒక్కో ప్రాంతం నుంచి నాయకుల్ని పక్కన పెట్టి కార్యకర్తల్ని పార్టీ కార్యాలయానికి పిలిపించి దినకరన్ రహస్య మంతనాలు సాగిస్తుండడం గమనించాల్సిన విషయం. కార్యకర్తల్లో ఆనందాన్ని, ఉత్సాహాన్ని నింపే విధంగా ఈ మంతనాలు సాగుతున్నట్టు సమాచారం. స్థానిక నాయకులు హ్యాండిచ్చినా, కార్యకర్త తనకు అండగా ఉంటే, వారి ద్వారా ఎన్నికల పనుల్ని వేగవంతం చేయించవచ్చన్న ఆశాభావంతో దినకరన్  అడుగులు ముందుకు కదులుతున్నట్టు ఆర్కేనగర్‌లోని అన్నాడీఎంకే కార్యకర్తలు పేర్కొంటున్నారు.