బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , మంగళవారం, 10 జనవరి 2017 (03:35 IST)

పాదాభివందన సంస్కృతికి స్టాలిన్ చరమగీతం...!

నాయకులను, నాయకురాళ్లను చూస్తే పొర్లు దండాలతో సాష్టాంగపడిపోయే తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రాజకీయ సంస్కృతి ప్రారంభమవుతోందా.. ఒంగి దండాలు పెట్టడం, కాళ్లపై పడిపోయి పాద పూజలు చేయడం వంటి సంస్కృతి ఇకనైనా పోవాలని, తనను కార్యకర్తలు, సానుభూతిపరులు కలిసినప్పుడు ఒక్క నమస్కారం పెడితే చాలని, పాదాభివందనాలు చేయవద్దని డీఎంకే నేతలను ఆ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ వేడుకున్నారు. కరుణానిధి ఆరోగ్యం ఇటీవలి కాలంలో పదే పదే అదుపు తప్పుతుండటంతో డీఎంకే భావినేతగా స్టాలిన్‌కి పట్టం కట్టిన విషయం తెలిసిందే. 
 
అధినేతల దృష్టిలో పడేందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ, ఒంగి దండాలు పెట్టడం, మరి కొందరు ఇంకో అడుగు ముందుకు వేసి ఏకంగా సాష్టాంగ నమస్కారాలు చేయడం తమిళనాట రాజకీయాల్లో నిత్యమూ చూసేదే. తాజాగా, డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన తరువాత, తన వద్దకు వస్తున్న నేతలు సైతం ఇదే విధంగా, తమను ఆశీర్వదించాలని కోరుతూ కాళ్లపై పడుతుంటే, ఆయన ఇబ్బందిగా భావిస్తూ, ఈ సంస్కృతికి చరమగీతం పాడాలంటూ, కేడర్‌కు ఓ లేఖ రాశారు. 
 
తనపై అతి పెద్ద బాధ్యతలు ఉన్నాయని చెబుతూ, నాయకులు ప్రేమానురాగాలతో అభినందనలు తెలియజేయడానికి వస్తున్న వేళ, పలువురు వ్యవహరిస్తున్న తీరు తన మనసును ద్రవింపచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కన్న తల్లిదండ్రులకు తప్ప మరొకరి కాళ్లపై పడి ఆశీర్వాదాలు పొందాల్సిన అవసరం నేతలకు లేదని, ఎదుటి మనిషికి గౌరవం ఇవ్వాలని భావిస్తే, నమస్కారం చేస్తే చాలని, పాద పూజలు, సాష్టాంగ నమస్కారాలు వద్దని వేడుకున్నారు.  
 
జయలలిత మరణంతో తమిళనాడ ఏర్పడిన రాజకీయ వెలితిని అనుకూలంగా మార్చుకోవాలని ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా సరే అధికారాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తున్న స్టాలిన్ డీఎంకే పార్టీలో కొత్త సంస్కృతిని నెలకొల్పాలనే కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. స్టాలిన్ ఆలోచనల్లో వచ్చన ఈ మార్పు తమిళనాడు రాజకీయాలను సరికొత్త దశకు మార్చనుందా.. కాలమే సమాధానం చెప్పాలి.