గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 3 జులై 2015 (13:55 IST)

తెలుగు భాష సేవలో జనని .. 23వ వసంతంలోకి...

తెలుగు భాష పరిరక్షణే ఆశయంగా ముందుకు సాగిపోతున్న సంస్థ జనని సాంఘిక సాంస్కృతిక సమితి. ఈ సంస్థ జూలై మూడో తేదీతో 22 యేళ్లు పూర్తి చేసుకుని 23వ యేటలోకి అడుగుపెట్టింది. ఒకపుడు చెన్నైపురి నగరంలో దేదీప్యమానంగా విరాజిల్లిన తెలుగు భాష.. కాలక్రమంలో కనుమరుగైపోసాగింది. దీన్ని చూసిన ఓ తెలుగు భాషాభిమాని తన మాతృభాష పరిరక్షణ కోసం తనవంతు సేవగా ఏదో ఒకటి చేయాలన్న బలమైన పట్టుదల, ఆకాంక్ష కారణంగా ఈ సంస్థ ఆవిర్భామైంది. ఆ భాషాభిమాని పేరు గుడిమెట్ల చెన్నయ్య. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు మాజీ చిరుద్యోగి.
 
 
ఈ సంస్థ గత 1993 జూలై 3వ తేదీన గురుపూర్ణిమ రోజున పురుడుపోసుకుంది. అప్పటి నుంచి ఇప్పటివరకు చెన్నై మహానగరంలో తెలుగుభాష పరిరక్షణ కోసం తనవంతు కృషి చేస్తూనే ఉంది. 'ఇంతింతై వటుడింతై' అన్న చందంగా ఎదిగిన జనని... చెన్నపురిలో ఉన్న అనేక తెలుగు సంస్థల్లో ఓ విలక్షణ సంస్థగా గుర్తింపును సొంతం చేసుకుంది. ముఖ్యంగా తెలుగు భాష, తెలుగు ప్రజల అస్థిత్వాన్ని కాపాడుకుంటూ తన ఉనికిని పరిరక్షించుకుంటూ గత రెండు దశాబ్దాలుగా తెలుగుతల్లి సేవలో లీనమైపోయింది. ఈ 22 యేళ్ల కాలంలో ఈ సంస్థ తెలుగుతల్లికి, తెలుగుభాషకు చేసిన సేవలు మాటల్లో వర్ణించలేనివి.

తెలుగు భాష పరిరక్షణ కోసం ఈ సంస్థ అనేక రకాలైన కార్యక్రమాలను చేపట్టింది. ఇందులో ప్రధానంగా ప్రతియేటా ఫిబ్రవరి 21వ తేదీన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం రోజున అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. తెలుగింటి తొలి పండగ ఉగాది రోజున తెలుగు భాష ఔన్నత్యాన్ని తెలియజెప్పేలా వివిధ రకాలైన అచ్చతెనుగు కార్యక్రమాలను నిర్వహిస్తూ నేటితరం యువతలో అవగాహన కల్పిస్తోంది. అలాగే చెన్నపురిలో తెలుగు, తమిళ ప్రజల మధ్య సోదరభావం నెలకొనేలా కృషి చేస్తూ ముందుకుసాగుతోంది.
 
 
అలాగే, జనని తన రెండు దశాబ్దాల ప్రస్థానంలో అనేకమంది తెలుగు భాషాపండితులను గుర్తించి సత్కరించింది. అలాగే, జనని ఇచ్చిన పిలుపు మేరకు ఎందరో ప్రముఖులు, తెలుగు భాషాభిమానులు తమ సేవలను జననికి అందించారు. పాఠశాల విద్యార్థులకు తనకు తోచిన రీతిలో జనని సాయం చేయడమే కాకుండా, వివిధ రకాలైన ప్రతిభా పోటీలను నిర్వహిస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తోంది. వీటితో పాటు జాషువా, వేమన, దువ్వూరి రామిరెడ్డి పేర్లపై వివిధ రకాల సాహితీ సదస్సులు నిర్వహిస్తూ మాతృభాషపై ఉన్న మమకారాన్ని చాటుతూ ముందుకు సాగుతోంది.