గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 23 జనవరి 2015 (15:59 IST)

రైతుకవి దువ్వూరి.. భావ కవితా యుగంలో వెలసిన కవికోకిల!

కర్షక జీవితంపై తొలి కావ్యాన్ని రచించిన దువ్వూరి రామిరెడ్డిపై చెన్నైలో జరిగిన జాతీయ సదస్సులో రామిరెడ్డిని వక్తలు కొనియాడారు. చెన్నై మెరీనా తీరంలోని రాజధాని కళాశాలలో బుధవారం ''కవికోకిల దువ్వూరి రామిరెడ్డి పద్యకావ్య పర్యాలోచనము'' అనే అంశంపై జాతీయ సదస్సు అట్టహాసంగా జరిగింది. 
 
తమిళనాడులో భావ కవితా యుగంలో వెలసిన కర్షక కవికోకిల దువ్వూరి రామిరెడ్డి రచనలు, జీవిత విశేషాలపై వక్తలు కొనియాడారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఎన్. వసుంధర ప్రార్థనా గీతంతో సభ మొదలైంది. ఈ కార్యక్రమానికి రాజధాని కళాశాల తెలుగుశాఖ అధ్యక్షురాలు హెచ్. అనిందిత అధ్యక్షత వహించగా, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి. ప్రమానందపెరుమాళ్ జ్యోతిప్రజ్వలన చేశారు. 
 
భారతీ మహిళా కళాశాల విశ్రాంత తెలుగు శాఖాధ్యక్షులు నిర్మలా పళనివేల్ ముఖ్య అతిథిగా, అఖిల భారత తెలుగు సమాఖ్య వ్యవస్థాపకులు డాక్టర్ సీఎంకే రెడ్డి, వేదవిజ్ఞానవేదిక అధ్యక్షులు జేకే రెడ్డి విశిష్ట అతిథులుగా హాజరై ప్రసంగించారు. 
 
కాగా రాజధాని కళాశాల విశ్రాంతాచార్యులు డాక్టర్ ఎల్‌బీ శంకరరావు కీలకోపన్యాసం చేశారు. ఆయన మాట్లాడుతూ.. దువ్వూరి రామిరెడ్డి పాఠశాల స్థాయి చదువు దాటకపోయినప్పటికీ దశ భాషా ప్రవీణుడై పలు భాషలలో కవిత్వం చెప్పగలిగే ప్రావీణ్యం సంపాదించారని కొనియాడారు. 
 
అనంతరం సీనియర్ పాత్రికేయులు మన్నవ గంగాధరప్రసాద్ సదస్సు లక్ష్యాన్ని వివరించారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి పరిశోధక విద్యార్థులు టి. కల్పనాగుప్తా అనుసంధానకర్తగా వ్యవహరించగా, పి. కాళియప్ప వందన సమర్పణ చేశారు. 
 
ఇకపోతే.. మొదటి సమావేశానికి శ్రీ కళాగౌతమికి అధ్యక్షులు, రాజమండ్రి వినియోగదారుల మండలికి అధ్యక్షులు అయిన శ్రీ సుంకర వీరశేఖర్‌గారు అధ్యక్షత వహించారు. ఈయన దువ్వూరి-మాతృశతకంపై పత్ర సమర్పణ చేశారు. అలాగే దువ్వూరి రామిరెడ్డి జీవితం -విశేషాలపై చెన్నైలోని ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణా కేంద్రం ప్రిన్సిపల్ డాక్టర్ ఎం. యతిరాజులు, దువ్వూరి రామిరెడ్డి-వనకుమారి అంశంపై రాజధాని కళాశాలకు చెందిన డాక్టర్ ఎన్. ఎలిజబెత్ జయకుమారి, దువ్వూరి రామిరెడ్డి కడపటి వీడ్కోలుపై శ్రీకాళహస్తిలోని ఎస్‌వీఏ ప్రభుత్వ కళాశాలకు చెందిన డాక్టర్ సి.సుకుమార్ రెడ్డి పత్రసమర్పణ చేశారు. 
అలాగే చెన్నై సెంట్రల్ ఎక్సైజ్ సహాయ నిర్దేశకులు డాక్టర్ ఉప్పలధడియం వెంకటేశ్వర (దువ్వూరి రామిరెడ్డి, కవి-రవి), ద్రావిడ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ జేవీ సత్యవాణి (దువ్వూరి రామిరెడ్డి: ఫలితకేశము) పత్ర సమర్పణ చేశారు. 
 
ఇదేవిధంగా మధ్యాహ్నం 2.30 గంటలకు జరిగిన 2వ సమావేశానికి ఎంవీఎం గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ ఉమెన్స్ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ పి.ఉమ అధ్యక్షత వహించి, దువ్వూరి రామిరెడ్డి: జలదాంగన అనే అంశంపై ఉపన్యాసం ఇచ్చారు. 
 
అలాగే ఆచార్య నాగార్జున యూనివర్శిటీకి చెందిన డాక్టర్ ఇ. మాధవి (దువ్వూరి రామిరెడ్డి: యువక స్వప్నము), రాణీమేరి కళాశాలకు చెందిన డాక్టర్ ఐ. ప్రసూన (దువ్వూరి రామిరెడ్డి: కుసుమాశ్రువులు , సోదరిస్మృతి, కోయిల, రెడ్డికుల ప్రబోధము, నక్షత్రమాల ఖండికలు), పట్టాభిరాంలోని డీఆర్‌బీసీసీసీ హిందూ కళాశాలకు చెందిన డాక్టర్ పి.సీతమ్మ(దువ్వూరి రామిరెడ్డి-పానశాల)లు పత్రసమర్పణ చేశారు. 
 
సాయంత్రం జరిగిన 3వ సమావేశానికి మద్రాస్ విశ్వవిద్యాలయం ఉపన్యాసకులు డాక్టర్ విస్తాలి శంకరరావు అధ్యక్షత వహించి, దువ్వూరి రామిరెడ్డి : అముద్రిత పద్యములు అనే అంశంపై ఉపన్యసించి, తన పద్యగానంతో సభను అలరించారు. 
 
తదనంతరం భారతి మహిళా కాలేజీకి చెందిన డాక్టర్ టి.రాజేశ్వరి (దువ్వూరి రామిరెడ్డి-కృషీవలుడు), రాజధాని కళాశాలకు చెందిన డాక్టర్ ఎం. ఆంబ్రూణి (దువ్వూరి రామిరెడ్డి : నలజారమ్మ)లు పత్ర సమర్పణ చేశారు. 
 
సాయంత్రం జరిగిన సమాపనోత్సవానికి డాక్టర్ ఎం. ఆంబ్రూణి స్వాగతం పలుకగా, ముఖ్యఅతిథిగా పాఠశాల విద్యావిభాగ రిటైర్డ్ డైరక్టర్ డాక్టర్. సి. పళనివేలు, విశిష్ట అతిథులుగా, శ్రీ వేణుగోపాల విశ్వవిద్యాలయ అధ్యక్షులు ఈఎస్ రెడ్డి, తెలుగు ఐక్యవేదిక అధ్యక్షులు కె. అనిల్‌కుమార్ రెడ్డి, ఆత్మీయ అతిథిగా జనని ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య హాజరయ్యారు. 
 
డీజీ వైష్ణవ కళాశాల విశ్రాంత తెలుగుశాఖాధ్యక్షులు డాక్టర్ కాసల నాగభూషణం సమానోత్సవ సందేశంతో పాటు అధ్యక్షత వహించగా.. తెలుగు వికాస సమితి అధ్యక్షులు పోజుల ముద్దుకృష్ణుడు స్పందన తెలిపారు. జనని సంయుక్త కార్యదర్శి మందలపు నటరాజ్ వందన సమర్పణతో సదస్సు దిగ్విజయంగా ముగిసింది.