బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 4 ఫిబ్రవరి 2016 (18:39 IST)

అన్నామలై వర్శిటీ లెక్చరర్లు, ప్రొఫెసర్లు అనర్హులట.. నెట్, స్లెట్, పీహెచ్‌డీ నో..!

అన్నామలై విశ్వవిద్యాలయంలో పనిచేసిన లెక్చరర్లు, ప్రొఫెసర్లు తాజా ఇంటర్వ్యూల్లో ఫెయిల్ అవుతున్నారట. అనర్హులుగా తేలిపోతున్నారట. నిధుల కొరత కారణంగా అన్నామలై వర్శిటీ మూతపడింది. అయితే విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని వర్శిటీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.

ఆపై అన్నామలై వర్శిటీ బాధ్యతను స్పెషల్ ఆఫీసర్‌కు అప్పగించింది. అయితే ఈ వర్శిటీలో పనిచేసి, ఇపుడు రోడ్డున పడిన అనేక మంది ప్రొఫెసర్లు, లెక్చరర్లు ఉపాధ్యాయ వృత్తికి ఏమాత్రం పనికిరారని తేలిపోయింది. 
 
వీరంతా ఉపాధి కోసం రాష్ట్రంలోని వివిధ కాలేజీల్లో ఉన్న ఖాళీ పోస్టుల లెక్చరర్, ప్రొఫెసర్ పోస్టుల కోసం ఇంటర్వ్యూలకు వెళ్తే అనర్హులంటూ తిప్పి పంపేస్తున్నారట. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న లెక్చరర్‌, ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ఇందుకోసం మూడేళ్ళ అనుభవం ఉన్న వారిని కాంట్రాక్ట్ విధానంలో ప్రభుత్వ ఆర్ట్స్‌, సైన్స్‌ కాలేజీల్లో ప్రొఫెసర్లుగా నియమించుకునేందుకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇందుకోసం ఆయా కాలేజీల్లో ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. 
 
ముఖ్యంగా చెన్నై, తిరువణ్ణామలై, గుడియాత్తం తదితర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ ఆర్ట్స్‌ కాలేజీలకు అన్నామలై వర్శిటీలో పనిచేసిన పలువురు ఇంటర్వ్యూలకు వెళ్ళగా, వారికి కనీస అర్హత కూడా లేదనే నిజం వెలుగులోకి వచ్చింది.

అన్నామలై వర్శిటీలో పనిచేసిన చాలామంది అధ్యాపక సిబ్బందికి యూజీసీ విధించిన స్లెట్‌ లేదా నెట్‌ పరీక్ష కూడా ఉత్తీర్ణత సాధించలేదని తేలిపోయింది. చాలామందికి పీహెచ్‌డీ కూడా లేదని వెల్లడైంది. ఇలాంటి వారంతా పలు శాఖల్లో లెక్చరర్లు, ప్రొఫెసర్లుగా విద్యాబోధన చేసినట్టు వెల్లడైంది.