బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , ఆదివారం, 19 ఫిబ్రవరి 2017 (01:42 IST)

అవినీతితో కాదు.. అమ్మతనంతో గెలిచిన జయలలిత

తమిళనాడు రాజకీయ సంక్షోభంలో ఒక దశ ముగిసింది. తాత్కాలిక గవర్నర్ సి. విద్యాసాగరరావు ప్రభుత్వాన్ని ఏర్పర్చాల్సిందిగా అన్నాడిఎంకె శశికళ గ్రూపుకు చెందిన ఇ పళనిస్వామిని ఆహ్వానించడం, శనివారం ఆయన మూజువాణి ఓటుతో బలపరీక్షలో నెగ్గడంతో పార్టీలో సంక్షోభం ముగిసినట్

తమిళనాడు రాజకీయ సంక్షోభంలో ఒక దశ ముగిసింది. తాత్కాలిక గవర్నర్ సి. విద్యాసాగరరావు ప్రభుత్వాన్ని ఏర్పర్చాల్సిందిగా అన్నాడిఎంకె శశికళ గ్రూపుకు చెందిన ఇ పళనిస్వామిని ఆహ్వానించడం, శనివారం ఆయన మూజువాణి ఓటుతో బలపరీక్షలో నెగ్గడంతో పార్టీలో సంక్షోభం ముగిసినట్లు కనిపిస్తోంది కాని, తమిళనాడులో రగులుతున్న సంక్షోభానికి పళని విజయం ముగింపు పలికిందని అర్థం కాదు. 
 
వాస్తవానికి పళని స్వామి ఎలాంటి ప్రాముఖ్యతా లేని, శశికళ వర్గానికి చెందిన మనిషి. అధికారం చేజిక్కించుకున్న వర్గంపై ప్రజల్లో అసమ్మతి ఎంత తీవ్రస్థాయిలో ఉందంటే శశివళ వర్గాన్ని అంటిపెట్టుకున్న ఎమ్మెల్యేలు ఇప్పుడు తమ నియోజకవర్గాలకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఈ ప్రజాగ్రహం నుంచి నేరుగా ప్రయోజనం పొందిన వర్గం పన్నీర్ సెల్వం వర్గమనే చెప్పాలి. 
 
ముఖ్యమైన విషయం ఏమిటంటే అన్నాడీఎంకే లోని రెండు వర్గాలు జయలలిత వారసత్వానికి తామే అర్హులమని చెప్పుకోవడమే. మృతి చెందిన పురుచ్చి తలైవి అవినీతిపరురాలని సుప్రీంకోర్టు ఆమెపై ప్రత్యేక కోర్టు గతంలో విధించిన శిక్షను నిర్ధారించిన నేపథ్యంలో ఇరు వర్గాలూ తామే జయ వారసులమని చెప్పుకోవడం గమనార్హం.
 
సుప్రీకోర్టు తీర్పు జయ వారసత్వాన్ని మార్చివేస్తుందా? శిక్ష నిర్ధారణతో ఆ వారసత్వం మసకబారుతుందా.. చాలామంది రాజకీయ పరిశీలకులు ప్రస్తుతం దీనిపైనే ఆలోచిస్తున్నారు. 
 
1990ల నాటి వార్తలను ఉరామరిగా చదివి ఉన్న ఏ పాఠకులకైనా నాటి జయలలిత సంపద విభ్రమ ప్రదర్శన గురించి తెలిసే ఉంటుంది. పిలిప్పీన్స్ అధినేత భార్య ఇమెల్డా మార్కోస్ సంపద కండూతిని నాటి జయలో చూశాం. అయితే ఆమెను దోషిగా నిర్ధారించిన తర్వాత క్షేత్ర వాస్తవాలు ఎలా ఉన్నాయంటే, జయ వారసత్వం నుంచి ఆమె కీర్తి ప్రభలు పక్కకు తగ్గుతున్న సూచనలు కనిపించడం లేదు.
 
ఆత్మప్రబోధాను సారం వ్యవహరించండి అంటూ చివర్లో దాడిచేసిన పన్నీర్ సెల్వం ఇప్పుడు తమిళనాడులో ఓడిపోయినప్పటికీ హీరోగానే ఆవిర్భవించారు. రాజకీయాల్లో ఇదొక సరికొత్త పరిణామం. కానీ ఆయన ఒక నేరస్తురాలి వారసత్వాన్ని ఎత్తిపడుతున్నారు. ఈ ఒక్కకారణమే జయలలిత జీవిత చరమాంకంలో ఏం సాధించింది అనేదాన్ని కథలుకథలుగా వివరించి చెబుతుంది.
 
జయలలిత చివరిరోజుల్లో ఎలాంటి పొత్తూ పెట్టుకోకుండానే విజయాన్ని సాధించింది. 2016 ఎన్నికల్లో విజయం పూర్తిగా ఆమె ఘనతే. దేశంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా మార్చివేయడానికి జయ ప్రారంభించిన సంక్షేమ పథకాల ద్వారా తమిళ ప్రజల మద్దతును ఆమె పొందింది. వారి మద్దతుపైనే ఆమె ఆధారపడింది. 
 
వాస్తవానికి అమ్మ పథకాలు హాస్యాస్పదమైనట్టివి. పూర్తిగా సొంత ప్రయోజనాలను ఆశించి చేపట్టిన పథకాలుగా కనిపించాయవి. కానీ తమిళనాడు ప్రజల దృష్టిలో మహిళల సాధికారత కోసం తీసుకువచ్చిన తక్కువ ఖర్చుతో కూడిన అమ్మ క్యాంటీన్ పథకం పూర్తి విభిన్నంగా కనిపించింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆమె రాజకీయ భవిష్యత్తును అది దృఢపర్చింది.
 
అవును.. అవినీతి విషమే కావచ్చు, అహంభావపూరితమైన ఆజ్ఞలు సమస్యే కావచ్చు. కానీ సగటు మనిషి రోజువారీ జీవిత వాస్తవికత ప్రకారం అది తల్లి కరుణగా, దయగా పరిణమించింది. 
 
జయలలిత గతంలో చేసిన అతి చర్యలను ప్రజలు క్షమించారు. ఆకాశాన్నంటిన అవినీతి సామ్రాజ్యం గత వైభవ చిహ్నం కావచ్చు. ఆ అతిచర్యలు, అవినీతి శశికళ క్రూర యంత్రాంగానికి బదలీ అయ్యాయి. తప్పు పనులను ప్రోత్సహించే ఆమె నెచ్చెలి మాత్రమే ప్రజా వ్యతిరేకిగా మారిపోయింది. అమ్మ వారసత్వంలోని మేధోతనం అదే. ఈ ప్రకాశమాన వ్యక్తిత్వమే జయను చిరస్మరణీయురాలిగా మార్చింది. ఎంతోమంది ఆమెను ఆరాధించేటట్టు చేసింది. 
 
కాబట్టి ఎంత కాలం పళనిస్వామి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉండగలడు, అన్నాడిఎంకే ఎప్పుడు చీలిపోతుంద అని అంచనా వేయడం ద్వారా, తమిళనాడు ఎంత కాలం శశికళ, ఆమె కుటుంబం నియంత్రణలో ఉంటుందని అంచనా వేయడంల ద్వారా ఎవరైనా సాధించేది ఏదీ ఉండదు. ఒక విషయం మాత్రం నిజం. అవినీతి ఉన్నా, లేకున్నా జయలలిత తన తప్పులన్నింటికీ అతీతంగా తమిళ హృదయాల్లో అమ్మలాగే నిలచిపోతుంది. తమిళ ప్రజల సామూహిక చైతన్యం మరి కొన్ని సంవత్సరాల తర్వాత జయ వారసత్వాన్ని మళ్లీ అంచనా వేసేంతవరకు ప్రస్తుతం అమ్మ వైభవం వెలుగుతూనే ఉంటుంది.