శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 20 ఫిబ్రవరి 2017 (01:41 IST)

తమిళ అసెంబ్లీలో ఐపీఎస్‌లు దూరారా? గవర్నర్ తీవ్ర ఆగ్రహం..

తమిళనాడు శాసనసభలో పళనిస్వామి ప్రభుత్వ బలపరీక్ష జరిగిన గత శనివారం నిబంధనలు ఉల్లంఘించి ఏకంగా తొమ్మిది మంది ఐపీఎస్‌లు సభలోకి రావడం వివాదానికి తెరతీసింది. ముందస్తు వ్యూహం ప్రకారమే ఐపీఎస్‌లను రంగంలోకి దించారనే డీఎంకే వర్గాలు ఆరోపిస్తున్నాయి.

తమిళనాడు శాసనసభలో పళనిస్వామి ప్రభుత్వ బలపరీక్ష జరిగిన గత శనివారం  నిబంధనలు ఉల్లంఘించి ఏకంగా తొమ్మిది మంది ఐపీఎస్‌లు సభలోకి రావడం వివాదానికి తెరతీసింది. ముందస్తు వ్యూహం ప్రకారమే ఐపీఎస్‌లను రంగంలోకి దించారనే డీఎంకే వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఆదివారం డీఎంకే ఎంపీలు తిరుచ్చి శివ, ఆర్‌ఎస్‌ భారతి, టీకేఎస్‌ ఇళంగోవన్  ఉదయం రాజ్‌భవన్ లో గవర్నర్‌ విద్యాసాగర్‌రావును కలిశారు. స్టాలిన్  తరఫున వినతిపత్రాన్ని సమర్పించారు. స్టాలిన్ పై దాడిని వివరించడంతో పాటు బలపరీక్షలో పళనిస్వామి గెలుపును రద్దు చేయాలని, మరోమారు బల పరీక్షకు ఆదేశించాలని విన్నవించారు. మాజీ సీఎం పన్నీర్‌సెల్వం సైతం గవర్నర్‌ను కలసి అసెంబ్లీలో శనివారం నాటి పరిణామాలను, స్పీకర్‌ వ్యవహరించిన తీరును వివరించారు. పళనిస్వామి గెలుపు చెల్లదంటూ ప్రకటించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.  సీఎం పళని స్వామి కూడా ఆదివారం గవర్నర్‌తో భేటీ అయ్యారు. అసెంబ్లీలో డీఎంకే పనిగట్టుకుని వీరంగాన్ని సృష్టించిందని విద్యాసాగర్‌రావు దృష్టికి తీసుకెళ్లారు.
 
తమిళనాడు అసెంబ్లీలో ఐపీఎస్‌ అధికారులు ప్రవేశించారనే వార్త సంచలనం సృష్టిస్తోంది. శనివారం నాడు డీఎంకే సభ్యులను అసెంబ్లీ నుంచి బయటకు తరలించేందుకు మార్షల్స్‌ రంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. అయితే మార్షల్స్‌ యూనిఫామ్‌లో నిబంధనలు ఉల్లంఘించి తొమ్మిది మంది ఐపీఎస్‌లు అసెంబ్లీలోకి అడుగు పెట్టినట్లుగా గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు ఆదేశాల మేరకు సాగిన విచారణలో తేలినట్టు తెలిసింది. సభలో ప్రవేశించిన 9 మంది ఐపీఎస్‌ అధికారులను గుర్తించినట్టు కూడా తెలిసింది. ముందస్తు పథకం ప్రకారమే ఐపీఎస్‌లను రంగంలోకి దింపారని, ప్రతిపక్ష నేత స్టాలిన్ పై దాడి కూడా పథకం ప్రకారమే జరిగిందన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి.
 
శనివారం నాటి పరిణామాలపై స్టాలిన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గవర్నర్‌ విచారణకు ఆదేశించినట్టు సమాచారం. మార్షల్స్‌ యూనిఫామ్‌ ధరించి పలువురు ఐపీఎస్‌ అధికారులు సభలో ప్రవేశించారని, అదికూడా స్పీకర్‌ సభలో లేని సమయంలో ప్రవేశించారని తెలుస్తోంది. వీరిలో చెన్నైలో అసిస్టెంట్, డిప్యూటీ, సహాయ కమిషనర్లుగా పనిచేస్తున్న శ్రీధర్, సంతోష్‌కుమార్, జోషి నిర్మల్‌ కుమార్, ఆర్‌.సుధాకర్, రవి, గోవిందరాజ్, ముత్తలగు, శివ భాస్కర్, దేవరాజ్‌లను గుర్తించినట్లు తెలిసింది. సభలో చెలరేగిన గందరగోళం నేపథ్యంలో ఆగమేఘాలపై ఐపీఎస్‌లను రంగంలోకి దించాల్సి వచ్చినట్టు అసెంబ్లీ కార్యదర్శి తన లేఖలో పేర్కొన్నట్టు తెలిసింది.  ఇలావుండగా కొద్ది రోజులుగా చెన్నైలోనే ఉన్న గవర్నర్‌ ముంబైకి బయలుదేరి వెళ్లారు.
 
తమిళనాడు ముఖ్యమంత్రి కె.పళనిస్వామి విశ్వాస పరీక్ష సందర్భంగా శనివారం ఆ రాష్ట్ర అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు ఆదేశించారు. వాస్తవానికి అసెంబ్లీలో చోటు చేసుకున్న సంఘటనలపై అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్  ఆదివారం ఉదయమే ఓ లేఖను గవర్నర్‌కు పంపించారు. అయితే ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్, మాజీ సీఎం పన్నీర్‌ సెల్వంలు వేర్వేరుగా తనతో భేటీ అయ్యి ఇచ్చిన ఫిర్యాదుల్ని గవర్నర్‌ పరిగణనలోకి తీసుకున్నారు. పూర్తి వివరాలతో సమగ్ర నివేదికను సమర్పించాలని అసెంబ్లీ కార్యదర్శికి ఆదివారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా సభలో ప్రతిపక్ష సభ్యులు లేకుండా జరిగిన ఓటింగ్‌పై వివరాలు అందజేయాలని కోరినట్లు తెలిసింది.