బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. »
  3. బాలప్రపంచం
  4. »
  5. చైల్డ్ కేర్
Written By PNR
Last Updated : మంగళవారం, 27 మే 2014 (21:21 IST)

మీ పిల్లలు లావుగా ఉన్నారా.. అయితే ఈ టిప్స్ పాటించండి!

మీ పిల్లలు లావుగా ఉన్నారా.. అయితే తల్లిదండ్రులే కేర్ తీసుకోవాలంటున్నారు.. చైల్డ్ కేర్ నిపుణులు. ప్రతి రోజూ వారు తీసుకునే ఆహారంలోనూ.. అలాగే వారి దినచర్యలలోనూ మార్పులు తీసుకురావాల్సింది కూడా తల్లిదండ్రులే. దీంతో పిల్లల శరీరంలో జరిగే మార్పులను నియంత్రించవచ్చని ఆరోగ్యనిపుణలు సూచించారు. 
 
పిల్లలు తరచూ బయటి ఆహార పదార్థాలను తింటుంటారు. అందునా ఫాస్ట్ ఫుడ్స్ మరియు బయట దొరికే జంక్‌ఫుడ్ లాంటివి ఎక్కువ తింటుంటారు. అలాగే వారికి నడక, సరైన వ్యాయామం ఏమాత్రం ఉండదు కనుక లావు కావడానికి ఎక్కువ ఆస్కారం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
సహజంగా పిల్లలు ఎన్ని కేలరీల ఆహారం తీసుకుంటుంటారో అన్ని కేలరీలను ఖర్చు చేయడం లేదు. ముఖ్యంగా నేడు పిల్లలు సైకిల్ ద్వారాగాని లేదా నడిచిగాని వారి వారి పాఠశాలలకు వెళ్ళడం లేదు సరికదా కనీసం వారికి సరైన వ్యాయామం కూడా వారి పాఠశాలల్లో లభించడంలేదు. దీంతో వారు లావుగా తయారువుతున్నారు. 
 
ఇక పాఠశాలనుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంట్లో టీవీలముందు కూర్చుంటే అక్కడినుంచి కదలడంలేదు. అలాగే కంప్యూటర్ల ముందు కూర్చున్నాకూడా కదిలే పరిస్థితి కనపడటం లేదు. దీంతో శరీరం లావుగా మారిపోతున్నారు. 
 
మీ పిల్లలు లావు తగ్గాలంటే?
* పిల్లల శరీరానికి వ్యాయామం తప్పనిసరి. అందులో జాగింగ్, రన్నింగ్ ఆటలు మొదలైనవి అవసరం. తక్కువ దూరంలోనున్న ప్రాంతాలకుకూడా వాహనాల్లో వెళ్ళనివ్వడం సమంజసం కాదు. వారిని నడిచి వెళ్ళేలా చేయడం తల్లిదండ్రుల కర్తవ్యం.  
 
* పిల్లలను వారానికి ఒకసారి జూ, పార్క్ లేదా మ్యూజియం లాంటి ప్రాంతాలకు తీసుకువెళ్ళండి. అక్కడ పిల్లలకు నడిచే అలవాటుతోబాటు వారికి కాస్త వ్యాయామం చేసే అవకాశం కలుగుతుంది. అలాంటి ప్రాంతాలలో పిల్లలతో కొన్ని ప్రత్యేక ఆటలు ఆడేందుకు ఆస్కారం కలుగుతుంది. 
 
* ఇంట్లోని చిన్న-చిన్న పనులు పిల్లలకు పురమాయించండి. ఉదాహరణకు వాహనాలను శుభ్రపరచడం, గోడలకు అంటిన దుమ్ము-ధూళిని తొలగించడం, బూజు దులపడంలాంటివి. దీంతో పిల్లలకు తాముకూడా ఇంటి పనుల్లో భాగస్వాములైనామన్న ఆనందం కలుగుతుంది. అందునా పిల్లలకు టీవీని చూసే సమయాన్ని కేటాయించండి. రాత్రి పూట భోజనం చేసిన తర్వాత పిల్లలను తీసుకుని వాకింగ్‌కు వెళ్ళండి. దీంతో పిల్లలు పగలంతా పడిన శ్రమ, కూర్చుని ఉన్నప్పుడు కలిగిన అలసట మొత్తం దూరమౌతుందంటున్నారు వైద్యులు.
 
* తల్లిదండ్రులే పిల్లలకు మార్గదర్శకులు. కాబట్టి మీరుకూడా ఉదయంపూట వ్యాయామం చేసే అలవాటు చేసుకోండి. దీంతో ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్యపరమైన ఆహారం మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నించండి. దీంతో పిల్లలుకూడా మిమ్ములను అనుకరించడానికి ప్రయత్నిస్తారు.
 
* పిల్లలను మీరు తరచూ బయటకు తీసుకుని వెళ్ళి పిజ్జా, బర్గర్‌లను తినిపిస్తుంటే వారి శరీరం లావుగా తయారుకావడానికి ఆస్కారం ఉంటుంది. దీంతో పిల్లలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని వారు తెలిపారు. వారు తీసుకునే ఆహారంలోని చక్కెర శాతం ఎక్కువై కొవ్వుగా మారి బరువు పెరగడానికి అవకాశం కలుగుతుందని ఆరోగ్యనిపుణులు తెలిపారు.