శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Updated : సోమవారం, 28 సెప్టెంబరు 2020 (20:18 IST)

కోవిడ్-19కి జాగ్రత్తలు: ఈ 15 పాయింట్లు పాటిస్తే కరోనావైరస్ మీతో రాదు

కోవిడ్-19 ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. అదే సమయంలో ప్రజలు కూడా బాధ్యతగా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు నిత్యం అవసరమైన జాగ్రత్తలను తీసుకోవాలి.

మన రోజువారీ కార్యకలాపాలు, ఆహార అలవాట్లలోనూ మార్పులు చేసుకుని కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవాలి. మార్కెట్లో కోవిడ్‌కి వాక్సిన్లు ఇంకా ప్రయోగాల దశలోనే ఉన్నప్పటికీ వచ్చేస్తున్నాయి అన్న ప్రచారం జరుగుతోంది. అయినా ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు. మన జాగ్రత్తల్లో మనం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకోసం మన పాటించాల్సిన ముఖ్యమైన 15 జాగ్రత్తలు ఇవి. 
 
1) బంధువులు, స్నేహితులు కనిపిస్తే  దూరం నుంచే పలకరించుకోండి. వారి యోగ క్షేమాలకు సంబంధించిన సమాచారం తెలుసుకోండి.
 
2) భౌతిక దూరం తప్పక పాటించాలి. ఎదుటి వ్యక్తికి కనీసం ఆరడుగులు లేదా రెండు గజాల దూరంలో ఉండండి.
 
3) బయటకి వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ మాస్కును ధరించాలి. సర్జికల్ మాస్కులు అయితే ఒకసారి వాడిన మాస్కును మళ్లీ ఉపయోగించవద్దు. ఇంట్లోనే తయారు చేసుకుని తిరిగి ఉపయోగించుకోగలిగే కాటన్ మాస్కులను వాడండి. క్లాత్ మాస్కు అయిన ఒకసారి వాడిన తర్వాత మళ్లీ ఉతికిన తర్వాతే వాడండి.
 
4) మీ కళ్లు, ముక్కు, నోటిని అనవసరంగా తాకకండి. ఎందుకంటే వీటి ద్వారానే వైరస్ మన శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది.  ఒకవేళ తాకినట్టయితే వెంటనే చేతులను శుభ్రం చేసుకోండి.
 
5) శ్వాసకోశ పరిశుభ్రతలను పాటించండి. తుమ్ము, దగ్గు వచ్చినపుడు మీ మోచేతిని అడ్డుపెట్టుకోండి. లేదా హ్యాండ్ కర్చీఫ్ ఉపయోగించండి.
 
6)  మీ చేతులను తరచుగా ఆల్కాహాల్ శానిటైజర్ తోగానీ, సబ్బు నీటితో గానీ కనీసం 20 నుంచి 40 సెకన్లపాటు శుభ్రంగా కడుక్కోవాలి.
 
7) పొగాకు, ఖైనీ, గుట్కా వంటి వాటిని తినవద్దు. బహిరంగంగా ఉమ్మివేయవద్దు.
 
8) తరచుగా తాకే వస్తువులు ప్రదేశాలు క్రమం తప్పకుండా క్రిమిసంహారకాలతో శుభ్రం చేయండి. 
 
9) అనవసరమైన ప్రయాణాలు మానుకోండి. అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయండి. పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లకు వెళ్లడం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంత శ్రేయస్కరం కాదు. 
 
10) ఎక్కువ మంది గుమికూడే ప్రదేశాలకు సాధ్యమైనంత వరకు వెళ్లకండి. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోండి.
 
11) ఆరోగ్యసేతు మరియు కోవిడ్-19 ఆంధ్రప్రదేశ్ యాప్ లను డౌన్లోడ్ చేసుకోండి. కోవిడ్-19 ఆంధ్రప్రదేశ్ యాప్ లో మీ దగ్గర్లోని ఆస్పత్రి, వైద్యుల సమాచారంతోపాటు కోవిడ్ పరీక్షలకు సంబంధించిన సమాచారం కూడా అందుబాటులో ఉంటుంది.
 
12) కోవిడ్ బారినపడిన వారిపై గాని, వారికి సంరక్షకులుగా ఉన్న వారిపై గానీ వివక్ష చూపవద్దు.
 
13) కోవిడ్ పై ఖచ్చితమైన సమాచారం కోసం ప్రభుత్వం నియమించిన అధికారులు, స్థానిక ఆరోగ్య కార్యకర్తలను మాత్రమే సంప్రదించండి.
 
14) ఒకవేళ జ్వరం, దగ్గు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటే వెంటనే 104 నంబర్ కు ఫోన్ చేయండి.
 
15) మానసికంగా ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నట్టు భావిస్తే అవసరమైన సలహా లేదా సాయం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 104, వై.ఎస్.ఆర్ టెలీమెడిసిన్ నెంబర్ 14410కు మిస్డ్ కాల్ ఇచ్చి ఫోన్ ద్వారా డాక్టర్‌తో మాట్లాడి మీ ఆరోగ్య సమస్యలను తెలపవచ్చు.