శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 7 ఆగస్టు 2020 (22:35 IST)

టిక్ అనే పురుగు ద్వారా చైనాలో మరో కొత్త వైరస్..

చైనాలో గత కొంత కాలంగా విచ్చలవిడిగా వైరస్‌లు వ్యాప్తిస్తున్నాయి. అక్కడ పుట్టిన “కరోనా” వైరస్ ‌ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తుండగా.. అదే సమయంలో “హంటా” వైరస్‌ వ్యాపించింది. ఆ తర్వాత  చైనాలో బుబోనిక్‌ ప్లేగుకు సంబంధించిన కొన్ని కేసులను అక్కడి ఆసుపత్రులు నిర్ధారించాయి.
 
తాజాగా చైనాలో మరో కొత్త వైరస్ ప్రమాదకర స్థాయిలో ప్రజలకు సోకుతుందని చైనా అధికారిక పత్రిక “గ్లోబల్ ‌టైమ్స్” ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ వైరస్ పేరు ఎస్‌.ఎఫ్‌.టీ.ఎస్‌. నావెల్‌ బునియా. చైనాలోని తూర్పు ప్రాంతంమైన నావెల్ బునియాలో ఈ వైరస్ వ్యాప్తి చెందిందని చెప్పుకొచ్చింది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి ఏడుగురు చనిపోగా, దాదాపు 60 మందికి ఈ వైరస్ సోకిందట.
 
దేశంలోని తూర్పు జియాంగ్స్‌ ప్రావిన్స్‌ రాజధానిలో ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో 37 మందిలో ఈ వైరస్ ఆనవాళ్లు ఉన్నాయని, ఆ తర్వాత తూర్పు చైనాలోనే అన్హోయ్‌ ప్రావిన్స్‌లో మరో 23 మందికి ఈ కొత్త వైరస్‌ సోకిందని ఈ కథనంలో పేర్కొంది. మొట్టమొదటగా జియాంగ్సూ ప్రావిన్స్‌లోని నాన్జింగ్‌లో ఓ మహిళకు వైరస్‌ సోకడంతో తీవ్రమైన జ్వరం, దగ్గుతో ఆసుపత్రిలో చేరిన ఆమెలో తెల్లరక్తకణాలు బాగా తగ్గిపోయినట్లు వైద్యులు గుర్తించారు.
 
దాదాపు నెలరోజుల పాటు చికిత్సనందించి డిశ్చార్జి  చేశారు. “ఎస్‌ఎఫ్‌టీఎస్” వైరస్‌ కొత్తదేమీ కాదు. దీనిని 2011లోనే చైనా గుర్తించింది. ఇది బునియా వైరస్ కేటగిరీకి చెందినదిగా వర్గీకరించింది. ఇది ‘టిక్’ అనే పురుగు(నల్లి వంటిది) ద్వారా మనుషులకు సోకుతుంది. తర్వాత మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తోంది. ఇది రక్తం, కళ్లె నుంచి ఇతరులకు సోకుతుందని ఝియాంగ్‌ యూనివర్శిటీ వైద్యులు వెల్లడించారు.
 
“టిక్‌” అనే పురుగు కుడితేనే ఈ వ్యాధి వచ్చేందుకు ఎక్కువ ఆస్కారం ఉందని వెల్లడించారు. ప్రస్తుతం అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు ఎక్కువగా ఉండటంతో ఈ వ్యాధి చైనా నుంచి అంత తేలిగ్గా వ్యాపించే అవకాశం లేదని ఇతర దేశాలు భావిస్తున్నాయి.