గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (19:00 IST)

బెంగాల్‌కే చెందిన మరో క్రికెటర్ తలకు గాయం.. ఆస్పత్రిలో చేరిక!

యువ క్రికెటర్ అంకిత్ కేసరి మరణవార్త మరువకముందే మరో క్రికెటర్ గాయపడిన వార్త వెలుగులోకి వచ్చింది. అదే బెంగాల్‌కు చెందిన రాహుల్ ఘోష్ అనే యువ క్రికెటర్‌కు లీగ్ క్రికెట్‌లో ఆడుతుండగా తలకు బలమైన గాయమైంది. మంగళవారం ఫీల్డింగ్ చేస్తుండగా ఘోష్ గాయపడ్డాడు. దీంతో, అతడిని ఆసుపత్రికి తరలించారు.

చికిత్స అందిస్తున్న డాక్టర్ మాట్లాడుతూ... తలకు ఎడమవైపున గాయమైందని, సీటీ స్కాన్‌లో రక్తం గడ్డకట్టినట్టు తేలిందని తెలిపారు. ప్రస్తుతం ఆ క్రికెటర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, అయినాగానీ, ఏడెనిమిది రోజులు పరిశీలనలో ఉంచుతామని చెప్పారు.  
 
కాగా బెంగాల్ డివిజన్ నాకౌట్ క్రికెట్ మ్యాచ్‌లో అంకిత్ కేసరీ మృతి చెందిన సంగతి తెలిసిందే. బెంగాల్ డివిజన్ 1 నాకౌట్ పోటీల్లో భాగంగా ఈ నెల 17న ఈస్ట్ బెంగాల్, భవానీపూర్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అర్నబ్ నంది స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి వచ్చిన అంకిత్.. డీప్ కవర్‌లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ బంతిని గాల్లోకి లేపాడు. అంకిత్‌తో పాటు ఆ బంతిని అందుకునేందుకు బౌలర్ సౌరవ్ మొండల్ కూడా పరుగెత్తుకొచ్చాడు. 
 
ఒకరిని గుర్తించని మరొకరు ఒక్కసారిగా ఢీకొనడంతో అంకిత్ కుప్పకూలాడు. అంకిత్‌కు తీవ్రగాయాలు కావడంతో అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయినా మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన అంకిత్ ఆదివారం తుదిశ్వాస విడిచాడు. ఈ ఘటన యావత్ క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది.