గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 10 అక్టోబరు 2015 (12:36 IST)

ధోనీపై అగార్కర్ విమర్శలు: జట్టులో స్థానమేంటి..? ఆయనకంత సీన్ లేదా?

స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన ట్వంటీ-20 సిరీస్‌ పరాభవం నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ ధోనీపై విమర్శలు ఎక్కువవుతున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్.. జట్టులో ధోనీ స్థానాన్ని ప్రశ్నించాడు. టెస్టు కెప్టెన్‌గా కోహ్లీ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని, పరిమిత ఓవర్లలో ధోనీ పాత్రపై ఓ నిర్ణయానికి రావాలంటున్నాడు. 
 
నాలుగో స్థానంలో బ్యాటింగ్ దిగాలన్న ధోనీ నిర్ణయాన్ని కూడా అగార్కర్ తప్పు బట్టాడు. మూడు, నాలుగు స్థానాల్లో బ్యాటింగ్‌ చేయగల సత్తా ఉన్న ఆటగాళ్లు జట్టులో ఉన్నారన్నాడు. ‘తొలి బంతి నుంచే హిట్టింగ్‌ చేసే సత్తా ఇప్పుడు ధోనీకి లేదు. అందువల్ల ధోనీ నాలుగో స్థానానికి బదులు ఐదు లేదా ఆరో నెంబర్‌లో బ్యాటింగ్‌కు రావడమే సరైనద’ని అగార్కర్‌ చెప్పుకొచ్చాడు.
 
‘ధోనీ భారత్‌కు లభించిన గొప్ప ఆటగాడనే విషయాన్ని కాదనలేం. అయినంత మాత్రాన జట్టు ఓటమికి కారణమవుతుంటే చూస్తూ ఉండలేం కదా. గతంలో ధోనీ సాధించిన దాన్ని దృష్టిలో పెట్టుకుని అతణ్ని సమర్థించడం సరైన పద్ధతి కాదన్నాడు. ధోనీని కెప్టెన్, ఆటగాడిగానూ నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని అగార్కర్ అన్నాడు.