శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 26 మార్చి 2015 (15:21 IST)

సిడ్నీ స్టాండ్స్‌లో అనుష్క.. అటొచ్చి.. ఇటెళ్లిన కోహ్లీ : ఓటమి దిశగా భారత్!!

వరల్డ్ క్రికెట్ టోర్నీలో భాగంగా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు పరాజయం దిశగా పయనిస్తోంది. 108 పరుగులకే నాలుగు ప్రధాన వికెట్లను కోల్పోయింది. ఇందులో ఓపెనర్లు శిఖర్ ధవాన్ (45), విరాట్ కోహ్లీ (1), రోహిత్ శర్మ (35), సురేష్ రైనా (13)లు ఉన్నారు. 
 
ఆస్ట్రేలియా నిర్ధేశించిన 329 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 22.6 ఓవర్లలో 108 పరుగులకే నాలుకు వికెట్లు కోల్పోవడంతో భారత్ విజయంపై ఆశలు గల్లంతయ్యాయి. ఆరంభంలో భారత ఓపెనర్లు ధావన్, రోహిత్ శర్మలకు ఆసీస్ ఫీల్డర్లు జీవదానం చేసినప్పటికీ.. వాటిని సద్వినియోగం చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఫలితంగా భారత్ కష్టాల్లో పడింది. 
 
మరోవైపు.. క్వార్టర్ ఫైనల్లో విఫలమైన విరాట్ కోహ్లీ... కీలకమైన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో సైతం విఫలమయ్యాడు. ధావన్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ చాలా ఇబ్బందిగా ఆడుతున్నట్టు అనిపించింది. 13 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి జాన్సన్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 
 
తన ప్రియురాలు, బాలీవుడ్ నటి అనుష్క శర్మను ప్రత్యేకంగా ముంబై నుంచి సిడ్నీకి పిలుపించుకున్న కోహ్లీ.. ఆమెను గ్యాలరీ స్టాండ్స్‌లో కూర్చోబెట్టి... మైదానంలోకి అటొచ్చి.. ఇటెళ్లాడు. అదీ కూడా నిర్లక్ష్యపూరితంగా బౌన్సర్‌ బంతిని కొట్టి కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ క్రికెటర్‌కు అత్యంత కీలకమైన మ్యాచ్‌లో ఎలా బ్యాటింగ్ చేయాలన్న ఆలోచన కంటే కూడా తన ప్రియురాలు గురించే ఎక్కువగా ఆలోచన చేస్తున్నట్టుగా కనిపించాడు. ఫలితంగానే తన వికెట్‌ను సమర్పించుకుని పెవిలియన్‌కు చేరాడు. దీంతో, కోహ్లీ నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశించిన అభిమానులు ఉసూరుమన్నారు.