బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 29 మార్చి 2015 (15:52 IST)

న్యూజిలాండ్ చిత్తు.. 2015 క్రికెట్ విశ్వవిజేతగా ఆస్ట్రేలియా

మెల్‌బోర్న్ వేదికగా, సొంత మైదానంలో ఆస్ట్రేలియా జట్టు ఐదోసారి వరల్డ్ కప్ క్రికెట్ విశ్వ విజేతగా నిలిచింది. తొలుత న్యూజిలాండ్ జట్టును 183 పరుగులకే కట్టడి చేసిన ఆస్ట్రేలియా, 184 పరుగుల సునాయాస లక్ష్యాన్ని 33.1 ఓవర్లలో 186 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 
 
ఆస్ట్రేలియా జట్టులో వార్నర్ 45, ఫించ్ 0, క్లార్క్ 74, పరుగులు చేయగా, స్మిత్ 56, వాట్సన్ 2 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. న్యూజిలాండ్ బౌలర్లలో హెన్రీ 2, బౌల్ట్ 1 వికెట్లు పడగొట్టారు. న్యూజిలాండ్‌పై విజయం తర్వాత మెల్ బోర్న్ స్టేడియం బాణసంచా వెలుగులతో నిండిపోయింది. ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. కివీస్ బౌలర్లలో హెన్రీ రెండు, బౌల్ట్ ఒక వికెట్ చొప్పున తీశారు. 
 
అంతకుముదు న్యూజిలాండ్ జట్టు తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా, ఈ జట్టుకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్ ఐదో బంతికి కివీస్ జట్టు కెప్టెన్, డాషింగ్ ఓపెనర్ మెక్‌కల్లమ్ డకౌట్ అయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు ఒక్క పరుగు (1/1) మాత్రమే. మెక్‌కల్లమ్ డకౌట్ కావడంతో కివీస్ క్రికెట్ అభిమానులు ఒక్కసారి పూర్తి నిరాశకు లోనయ్యారు. 
 
ఆ తర్వాత ఓపెనర్ గుప్తిల్ రూపంలో కివీస్ తన రెండో వికెట్‌ను కోల్పోయింది. మ్యాక్స్‌వెల్ వేసిన అద్భుతమైన బంతి వికెట్లను గీరాటేసింది. దీంతో ఓపెనర్ గుప్తిల్ 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అపుడు కివీస్ స్కోరు రెండు వికెట్ల నష్టానికి 39 (39/2) పరుగులు చేసింది. 
 
ఆ తర్వాత తన మూడో వికెట్‌ను కోల్పోయింది. జట్టు స్కోరు 39 పరుగులు వద్ద ఉండగా బ్యాట్స్‌మెన్ విలియమ్సన్ జాన్సన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 33 బంతులు ఎదుర్కొన్న విలియమ్సన్ ఒక ఫోరు సాయంతో 12 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. జట్టు స్కోరు 39/3. 
 
ఈ దశలో రాస్ టేలర్, ఇలియట్‌ల జోడీ 111 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడమే కాకుండా, జట్టు స్కోరును 150 పరుగులకు ఈ చేర్చారు. ఈ క్రమంలో టేలర్ 150 (150/4) పరుగుల వద్ద, ఆండర్సన్ 150 (150/5) పరుగుల వద్ద, రోంచి 151 (151/6) పరుగుల వద్ద తమ వికెట్లను కోల్పోయారు. దీంతో కేవలం ఒక్క పరుగు వ్యవధిలో మూడు వికెట్లను చేజార్చుకుని కష్టాల్లో పడింది. 
 
ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన వెట్టోరి కూడా 9 పరుగులు చేసి జట్టు స్కోరు 167 (167/7) పరుగుల వద్ద జాన్సన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ క్రమంలో 83 పరుగుల వద్ద ఇలియట్స్ కూడా ఫుల్కన్ బౌలింగ్‌లో కీపర్ హ్యాడ్డిన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికి కివీస్ స్కోరు 41.5 ఓవర్లలో 171/8 పరుగులు. 
 
అయితే, ఆ తర్వాత మిగిలిన ఇద్దరు ముగ్గురు బ్యాట్స్‌మెన్లు కూడా ఆసీస్ బౌలర్ల ధాటికి నిలువలేకపోయారు. ఫలితంగా హెన్రీ జాన్సన్ బౌలింగ్‌లో స్టార్క్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగా, సౌథీ 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్ అయ్యాడు. దీంతో కివీస్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఇన్నింగ్స్ ముగిసింది. బౌల్ట్ (0) నాటౌట్‌గా నిలువగా, ఎక్స్‌ట్రాల రూపంలో 13 పరుగులు వచ్చాయి. 
 
దీంతో కివీస్ జట్టు 45 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో జాన్సన్, ఫుల్కనర్‌లు మూడేసి వికెట్లు తీయగా, స్టార్క్ రెండు, మ్యాక్స్‌వెల్ ఒక వికెట్ చొప్పున తీసి కివీస్ బ్యాటింగ్ వెన్ను విరిచారు. ఆ తర్వాత 184 పరుగుల సునాయాస విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు.. ఆడుతూపాడుతూ లక్ష్యాన్ని చేరుకుని మరోమారు విశ్వవిజేతగా నిలిచింది.