శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 29 జులై 2015 (15:08 IST)

శ్రీశాంత్‌ ఆశలపై నీళ్లు చల్లిన బీసీసీఐ: నిషేధాన్ని ఎత్తివేసేది లేదట!

స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో నిర్దోషిగా బయటపడి.. మళ్లీ ఇండియా తరపున బరిలోకి దిగాలనుకుంటున్న క్రికెటర్ శ్రీశాంత్ ఆశలపై బీసీసీఐ నీళ్లు చల్లింది. శ్రీశాంత్‌తో పాటు అంకిత్ చవాన్‌పై విధించిన నిషేధాన్ని ఎత్తివేసే ప్రసక్తే లేదని బీసీసీఐ కార్యదర్శి ఠాకూర్ తేల్చి చెప్పేశారు. ఆటగాళ్లపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా బీసీసీఐ తీసుకున్న నిర్ణయం అమల్లోనే ఉంటుందన్నారు. 
 
చట్టపరమైన చర్యలకు, బోర్డు తీసుకున్న క్రమశిక్షణ చర్యలకు సంబంధం ఉండదని ఠాకూర్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో శ్రీశాంత్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని కేరళ క్రికెట్ సంఘం చేసిన విన్నపాన్ని బీసీసీఐ తిరస్కరించింది. అలాగే అంకిత్ చవాన్, అజిత్ చాండిలా విషయంలోనూ బీసీసీఐ క్రమశిక్షణ నిర్ణయం అమల్లో ఉంటుందని ఠాకూర్ వెల్లడించారు. 
 
కాగా, స్పాట్ ఫిక్సింగ్ మచ్చ తొలగిపోవడంతో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే దిశగా జీవితకాల నిషేధాన్ని ఎత్తివేయాలని బీసీసీఐని కోరనున్నట్లు శ్రీశాంత్ చెప్పాడు. తనపై బీసీసీఐ సానుకూలంగా స్పందిస్తుందని ఆశలు పెట్టుకున్న శ్రీశాంత్‌కు బీసీసీఐ నుంచి షాక్ తినే రెస్పాన్స్ వచ్చింది.