శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 7 మార్చి 2017 (17:46 IST)

బెంగుళూరు టెస్ట్ : 'కంగారు'పుట్టించిన భారత బౌలర్లు... టీమిండియా మిరాకిల్ విన్

బెంగుళూరు వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో మిరాకిల్ విన్‌ను భారత్ తన ఖాతాలో వేసుకుంది. 188 పరుగులు విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు కేవలం 112 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో కోహ్లీ సేన

బెంగుళూరు వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో మిరాకిల్ విన్‌ను భారత్ తన ఖాతాలో వేసుకుంది. 188 పరుగులు విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు కేవలం 112 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో కోహ్లీ సేన 75 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. ఈ విజయంతో 4 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసింది. పూణె వేదికగా జరిగిన తొల టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించిన విషయం తెల్సిందే. 
 
కాగా, బెంగుళూరు టెస్టులో నాలుగో రోజైన మంగళవారం భారత్ తన ఓవర్ నైట్ స్కోరు 213/4తో మంగళవారం బ్యాటింగ్ చేపట్టింది. అయితే, ఆసీస్ బౌలింగ్ ముందు భారత టెయిల్ ఎండ్ బ్యాట్స్‌మెన్లు చేతులెత్తేశారు. ఫలితంగా భారత్ త్వరత్వరగా వికెట్లను కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో పేకమేడలా కూలిన భారత రెండో ఇన్నింగ్స్‌లో కొంతమేరకు రాణించారు. ఈ కారణంగా సిరీస్‌‌లో తొలిసారి రెండొందల మార్కు దాటింది. 
 
ఈ రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా ఆసీస్ బౌలర్ హాజెల్‌వుడ్ బంతితో రెచ్చిపోయాడు. తన మ్యాజిక్ బౌలింగ్‌లో ఆరుగురు భారత బ్యాట్స్‌మెన్లను ఔట్ చేశాడు. ఫలితంగా టీమిండియా 274 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా ముంగిట 188 పరుగుల చిన్నపాటి విజయలక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్‌లో హాజెల్‌వుడ్ ఆరు వికెట్లు తీయ‌గా, స్టార్క్ రెండు, ఓకీఫె రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. 
 
అనంతరం 188 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను భారత బౌలర్లు కోలుకోలేని దెబ్బతీశారు. టీమిండియా బౌలర్లు సరైన సమయంలో జూలు విదిల్చి కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లు టీమిండియా బౌలర్ల బంతులకు విలవిల్లాడారు. దీంతో వార్నర్ (17), రెన్ షా  (5), షాన్ మార్ష్ (9), స్మిత్ (28), మిచెల్ మార్ష్ (13), మాధ్యూ వేడ్ (0), మిచెల్ స్టార్క్ (1) స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు. 
 
మూడవ డౌన్‌లో దిగిన హ్యాండ్స్ కోంబ్ (24) ధాటిగా ఆడుతూ జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అతనికి జతగా ఒకీఫ్ (0) క్రీజులో కొంతమేరకు సహకారం అందించినా ఫలితం లేకుండా పోయింది. కోంబ్ ఔట్ కావడంతో తర్వాతి బ్యాట్స్‌మెన్లు లియాన్ (2), హాజెల్‌వుడ్ (0)లు భారత బౌలర్ల ముందు నిలబడలేక చేతులెత్తేశారు. ఫలితంగా ఆస్ట్రేలియా జట్టు 112 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో అశ్విన్ నాలుగు, ఉమేష్ యాదవ్ రెండు, ఇషాంత్ ఒక వికెట్ తీసి ఆకట్టుకున్నారు.  
 
స్కోరుబోర్డు 
భారత్ తొలి ఇన్నింగ్స్‌: 189 ఆలౌట్‌; 
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : 276 ఆలౌట్‌;
భారత్ రెండో ఇన్నింగ్స్ : 274 ఆలౌట్. 
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ 112 ఆలౌట్. 
ఫలితం : 75 పరుగులతో భారత్ గెలుపు.