మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By CVR
Last Updated : గురువారం, 5 మార్చి 2015 (14:33 IST)

ప్రపంచ కప్: ఆరు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం..!

ప్రపంచకప్‌ టోర్నీలో భాగంగా నెల్సన్‌ మైదానంలో స్కాట్లాండ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.  స్కాట్లాండ్ నిర్దేశించిన 319 పరుగుల లక్ష్యాన్ని 48.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
 
హోరాహోరిగా సాగిన ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్‌ చేసిన స్కాట్లాండ్‌ జట్టు.. ఓపెనర్‌ కొయిట్జర్‌ (159) శతకం సాధించడంతో నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో ధాటిగా ఆడిన బంగ్లాదేశ్‌ 48.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 322 పరుగులు చేసింది. ప్రపంచకప్ లో బంగ్లాదేశ్ కు ఇదే అతిపెద్ద ఛేదన. 
 
ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ ఓపెనర్‌ తమీమ్‌ ఇక్బాల్‌(95) శతకం చేజార్చుకున్నప్పటికీ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత క్రీజ్‌పైకి వచ్చిన మహ్మదుల్లా (62), ముష్ఫికర్ రహీం (60) అర్థ సెంచరీలతో రాణించారు. 
 
ఇదే ఊపుతో బ్యాటింగ్ చేపట్టిన షకీబ్ అల్ హసన్ 52, షబ్బీర్ రహమాన్ 42 పరుగులతో అజేయంగా నిలిచి బంగ్లాను విజయ తీరాలకు చేర్చారు. కాగా, 156 పరుగులు చేసిన కొయిట్జర్‌కే 'మ్యాన్ ఆఫ్ మ్యాచ్' దక్కింది. బంగ్లాదేశ్ ఈ విజయంతో 5 పాయింట్లతో గ్రూపు-ఏలో 4వ స్థానంలో నిలిచింది.