శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 8 ఫిబ్రవరి 2016 (13:05 IST)

లోధా కమిటీపై అనురాగ్ ఠాకూర్ అసంతృప్తి: డీడీసీఏకు బీసీసీఐ గడువు

బోర్డులో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని తాము నమ్ముతున్నట్లు బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. గత తొమ్మిదేళ్ల పాటు అదే పని చేస్తున్నామని వెల్లడించారు. తాము సరైన దిశలో వెళ్తున్నామని తమ పనులే చెప్తున్నట్లు అనురాగ్ వెల్లడించారు. లోధా కమిటీ చాలా ప్రతిపాదనలు చేసిందని.. అయితే అందులో మంచేదో.. చెడేదో చెప్పే హక్కు మాత్రం మాకుందని ఠాకూర్ పేర్కొన్నారు. జస్టిస్ లోధా కమిటీ ప్రతిపాదనలను అమలు చేయడానికి కాస్త సమయం పడుతుందని అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. 
 
అంతేకాకుండా లోధా కమిటీపై మొత్తానికి అసంతృప్తిని వ్యక్తం చేసిన అనురాగ్ ఠాకూర్.. గత 30, 40 ఏళ్లుగా బీసీసీఐలో జరుగుతున్నదంతా తప్పే అంటే ఎలా అని, జరిగిన పొరపాట్లను కూడా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇకపోతే.. ట్వంటీ-20 ప్రపంచ కప్ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చేందుకు అవసరమైన అన్ని సర్టిఫికేట్లు పొందేందుకు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ)కు బీసీసీఐ సోమవారం (8 ఫిబ్రవరి) వరకు తుది గడువు ఇచ్చింది. 
 
ఈ లోగా అన్ని అంశాలకు సంబంధించిన నిరభ్యంతర పత్రాలు సమర్పించకపోతే ప్లాన్-బిని అమలు చేస్తామని ఠాకూర్ వెల్లడించారు. మరోవైపు కోట్లా స్టేడియంలో జరుగుతున్న పనులను కూడా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పరిశీలించనున్నారు.