గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 28 జులై 2015 (10:48 IST)

ఉగ్రవాదులకు అడ్డాగా మారిన పాక్‌తో ఆటల్లేవు: తేల్చేసిన భారత్

పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ గట్టి షాక్ ఇచ్చింది. పంజాబ్‌లోని గురుదాస్ పూర్ జిల్లా దీనానగర్‌పై ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. క్రికెట్ కంటే దేశ ప్రజల భద్రతే ముఖ్యమని చెప్పిన బీసీసీఐ, ఉగ్రవాదులకు అడ్డాగా మారిన పాకిస్థాన్‌తో ఆడేది లేదని స్పష్టం చేసింది. దీంతో త్వరలోనే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరుగుతుందని ఆశతో ఉన్న పీసీబీకి షాక్ తగిలింది.
 
‘‘ఉగ్రవాదుల దాడుల వల్ల భారత పౌరుల భద్రతకు, దేశంలో శాంతికి విఘాతం ఏర్పడితే క్రికెట్ ఆడలేం. ఈ విషయాన్ని పాకిస్థాన్ తెలుసుకోవాలి. క్రీడలనేవి భిన్నమైన అంశమే అయినా బీసీసీఐ కార్యదర్శి, పార్లమెంటు సభ్యుడిగా అంతర్గత భద్రత నాకు చాలా ముఖ్యం’ అని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ఘాటుగా స్పందించారు.
 
దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో ‘దాయాదుల పోరు’గా ప్రసిద్ధికెక్కిన భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్‌లను ఇక చూస్తామా అనేది అనుమానాస్పదంగా మారింది. అంతేకాదు.. భారత్‌తో సిరీస్ ఆడిన తర్వాత రిటైరవుతానంటున్న పాక్ టెస్టు కెప్టెన్ మిస్బావుల్ హక్ కోరిక కూడా తీరేలా లేదు.