గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 8 ఫిబ్రవరి 2016 (19:04 IST)

క్రికెట్ కెరీర్‌కు బ్రెండన్ మెక్ కల్లమ్ స్వస్తి: అత్యధిక వన్డే సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా రికార్డు!

కివీస్ స్టార్ బ్యాట్స్‌మన్ బ్రెండన్ మెక్ కల్లమ్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు స్వస్తి చెప్పాడు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికీ.. క్రికెట్ కెరీర్‌కు గుడ్ బై చెప్పేందుకు ఇదే మంచి సమయమని నిర్ణయించినట్లు మెక్ కల్లమ్ వ్యాఖ్యానించాడు. అయితే ఐపీఎల్‌ నుంచి వైదొలగేది లేదని చెప్పాడు. 
 
ఆస్ట్రేలియాపై 55 పరుగుల విజయంతో న్యూజిలాండ్ జట్టు మెక్ కల్లమ్‌కు ఘనమైన వీడ్కోలు పలికింది. 27 బంతుల్లో 47 పరుగులు సాధించిన మెక్ కల్లమ్ న్యూజిలాండ్ తరపున అత్యధిక వన్డే సిక్సర్లు (200) బాదిన క్రికెటర్‌గా రికార్డుపుటల్లో తన పేరు లిఖించుకున్నాడు. కాగా, అంతర్జాతీయ స్థాయిలో షాహిద్ అఫ్రిదీ (352), సనత్ జయసూర్య (270) క్రిస్ గేల్ (238), తరువాత మెక్ కల్లమ్ కొట్టిన సిక్సర్లే ఎక్కువే కావడం గమనార్హం.
 
ఈ సందర్భంగా మెక్ కల్లమ్ మాట్లాడుతూ.. క్రికెట్‌తో తన సంబంధాన్ని మరిచిపోలేనని చెప్పాడు. తన సహచరులు తన కెరీర్‌కు చక్కని సహకారం అందించారని తెలిపాడు. 14 ఏళ్ళ పాటు క్రికెట్లో రాణించడం పట్ల మెక్ కల్లమ్ హర్షం వ్యక్తం చేస్తూ.. అభిమానులకు, సహచరులకు, కుటుంబీకుల కృతజ్ఞతలు తెలిపాడు. కాగా మెక్ కల్లమ్ 260 వన్డేలు ఆడాడు. తద్వారా తన వన్డే కెరీర్‌ను మెక్ కల్లమ్ 6,083 పరుగుల వద్ద ముగించాడు.