గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 28 ఫిబ్రవరి 2015 (16:49 IST)

వరల్డ్ కప్ : రోహిత్ అర్థ సెంచరీ.. యూఏఈపై భారత్ ఘన విజయం!

వరల్డ్ కప్ టోర్నీలో భారత్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకుంది. శనివారం పెర్త్ వేదికగా క్రికెట్ పసికూన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో జరిగిన ఈ టోర్నీ 21వ లీగ్ మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. దీంతో భారత్ ఇప్పటి వరకు తాను ఆడిన మూడు మ్యాచ్‌లలో గెలుపొంది గ్రూపు బిలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 
 
కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యుఏఈ జట్టు భారత బౌలర్ల ధాటికి కేవలం 102 పరుగులకే కుప్పకూలింది. ముఖ్యంగా భారత స్పిన్ తాకిడికి విలవిల్లాడిపోయింది. ఆ జట్టులో అన్వర్ (35), ఖుర్రుమ్ ఖాన్ (14), గురుజ్ (10)లు మినహా మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌ స్కోరుకే పరిమితమయ్యారు. అదనపు పరుగుల రూపేణా భారత బౌలర్లు 13 పరుగులు సమర్పించడం గమనార్హం. భారత బౌలర్లలో అశ్విన్ నాలుగు వికెట్లు తీయగా, యాదవ్, జడేజాలు రెండేసి వికెట్లు, కుమార్, శర్మలు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. 
 
ఆ తర్వాత 103 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ వికెట్ నష్టానికి 18.5 ఓవర్లలో 104 పరుగులు చేసింది. భారత ఓపెనర్లలో రోహిత్ శర్మ (57) అర్థ సెంచరీతో రాణించగా, మరో ఓపెనర్ శిఖర ధావన్ 14 పరుగులు చేశాడు. ధావన్ ఔట్ కావడంతో క్రీజ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ వికెట్‌ను చేజార్చుకోకుండా (33 నాటౌట్) ఆడి.. జట్టుకు విజయాన్ని అందించాడు. నవీద్ బౌలింగ్‌లో ధావన్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అశ్విన్‌కు లభించింది.