గురువారం, 28 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 24 ఏప్రియల్ 2015 (15:58 IST)

ఢిల్లీ గెలుపు: ముంబైకి తప్పని ఓటమి.. 37 పరుగుల తేడాతో డేర్‌డెవిల్స్ అదుర్స్!

ఐపీఎల్-8లో ముంబై ఇండియన్స్ ఓటమి పరంపరను కొనసాగిస్తోంది. గురువారం రాత్రి జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు ఢిల్లీ డేర్ డెవిల్స్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్లు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ స్కోరు చేసింది. ఢిల్లీ ఓపెనర్ శ్రేయాస్ అయ్యర్ (83), జేపీ డుమిని (78)లు జట్టుకు శుభారంభాన్నిచ్చారు. 
 
దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ 190 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై, 20ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 154 పరుగులకే చేతులెత్తేయడంతో ఢిల్లీ విజయం ఖరారైంది. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ (30), హైదరాబాదీ కుర్రాడు అంబటి రాయడు (30)లతో పాటు ఓపెనర్‌గా బరిలోకి దిగిన పార్ధీవ్ పటేల్ (28) మినహా మిగిలిన వారెవరూ బ్యాట్ ఝుళిపించలేకపోయారు. దీంతో ముంబై ఢిల్లీ డేర్ డెవిల్స్ 37 పరుగుల తేడాతో గెలుపొందింది.
 
కాగా, ఢిల్లీ ఆటగాళ్లు శ్రేయాస్, డుమినిలు రెండో వికెట్‌కు 154 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. మాథ్యూస్‌ (8 బంతుల్లో 17) వేగంగా ఆడాడు. హర్భజన్‌ సింగ్‌ మూడు వికెట్లు తీశాడు. 2013 నుంచి సొంత మైదానంలో ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలైన ఢిల్లీకి తొలి గెలుపు దక్కింది. ఈ విజయంతో డుమినీ సేన ఆరు పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. రెండు పాయింట్లతో ఉన్న ముంబై చివరి స్థానానికి పడిపోయింది.