గురువారం, 28 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 8 అక్టోబరు 2015 (09:36 IST)

ట్వంటీ-20 సిరీస్ : నేడు సఫారీలతో భారత్ మ్యాచ్.. పరువు దక్కేనా?

ట్వంటీ-20 సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికా జట్టుతో భారత్ గురువారం చివరి మ్యాచ్‌ను ఆడనుంది. ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌లలో టీమిండియా పర్యాటక దక్షిణాఫ్రికా జట్టు చేతిలో చిత్తుగా ఓడి.. సిరీస్‌ను కోల్పోయిన విషయంతెల్సిందే. ఈ నేపథ్యంలో మూడు మ్యాచ్‌లో సిరీస్‌లో చివరి ట్వంటీ-20 మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా జరుగనుంది. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా విజయం సాధించి పరువు నిలుపుకోవాలని భారత్ జట్టు ఆరాటపడుతుంటే... సఫారీలు మాత్రం క్లీన్‌స్వీప్‌పై కన్నేశారు. దీంతో ఇరు జట్ల మధ్య మరోమారు రసవత్తరంగా మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. 
 
ప్రతిష్టాత్మక గాంధీ-మండేలా ట్రోఫీని రెండు వరుస ఓటములతో ఆరంభించిన ధోనీ గ్యాంగ్... వన్డే సిరీస్‌కు ముందు గాడిన పడేందుకు మూడో టీ20ని వినియోగించుకోవాలనుకుంటోంది. ఇప్పటికే సిరీస్‌ సాధించి.. క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన సఫారీలను అడ్డుకోవాలంటే ధోనీసేన సర్వశక్తులూ ఒడ్డాల్సిందే. కటక్‌లో రెండో టీ20లో ఘోర వైఫల్యం నేపథ్యంలో ధోని సహా జట్టంతా తీవ్ర ఒత్తిడిలో ఉంది. జట్టు కూర్పు దగ్గర్నుంచి ఆట వరకు మారాల్సింది చాలానే ఉంది. రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉన్న సఫారీలకు కళ్లెం వేయాల్సిన తరుణం కూడా ఇదే. లేదంటే వన్డే సిరీస్‌లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.
 
ఇకపోతే.. జట్టు మార్పుచేర్పులపై కూడా ధోనీ దుష్టిసారించాల్సివుంది. రెండో టీ20లోనూ అతను అదే ఒరవడి కొనసాగించాడు. రాయుడు లేదా ధావన్‌లలో ఒకరిని తప్పించి రహానెను తీసుకోవాలన్న డిమాండ్‌ను పట్టించుకోలేదు. అయితే వరుసగా రెండో మ్యాచ్‌లోనూ వాళ్లిద్దరూ ఘోరంగా విఫలంకావడంతో ధోనీపై తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. రహానేను ఆడించకపోవడంపై విమర్శలు తీవ్రమవుతున్న నేపథ్యంలో రాయుడు, ధావన్‌ల్లో ఒకరిని తప్పించాల్సిన నిర్బంధ పరిస్థితి ఏర్పడింది. 
 
మరోవైపు అక్షర్‌ పటేల్‌పైనా వేటు తప్పకపోవచ్చు. అతను సైతం రెండో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. అక్షర్‌ స్థానంలో మిశ్రాను ఆడించే అవకాశముంది. ఇకపోతే ఈ మ్యాచ్‌ ధోనీకి అగ్నిపరీక్షలా మారింది. తాను ఆడటం, జట్టును నడిపించడం అతడికి సవాలుగా మారింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌, కెప్టెన్లలో ఒకడైన ధోనీ.. గతకొంతకాలంగా స్థాయికి తగినట్టుగా ప్రదర్శన చేయట్లేదు. తొలి రెండు టీ20ల్లోనూ ధోనీ ముద్ర కనిపించలేదు. రెండో మ్యాచ్‌లో జట్టు ఎన్నో ఆశలు పెట్టుకున్న స్థితిలో పూర్తిగా నిరాశపరిచాడు. 
 
ధోనీతో పాటు రోహిత్‌, కోహ్లీ, రైనా స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తేనే ఈడెన్‌లో విజయాన్ని ఆశించగలం. బౌలింగ్‌లో ధోని వ్యూహాలు, ప్రణాళికలు అంతగా పని చేయట్లేదు. అశ్విన్‌ మినహా ఏ బౌలరూ ఓ మోస్తరుగానైనా రాణించకపోవడం ధోనీని కలవరపెడుతోంది. ఈడెన్‌ పిచ్‌ స్పిన్‌కు అనుకూలిస్తుందన్న కబురు భారత కెప్టెన్‌కు సంతోషాన్నిచ్చేదే. మరి స్పిన్నర్లను ఏ విధంగా ప్రయోగించి.. సఫారీల ఆట కట్టిస్తాడో చూడాలి. ఆరంభ ఓవర్లలో పేసర్ల ప్రదర్శన కీలకం. వికెట్ల మధ్య బ్యాట్స్‌మెన్‌ పరుగు.. ఫీల్డింగ్‌ కూడా భారత్‌ దృష్టిపెట్టాల్సిన అంశాలు.