గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (16:23 IST)

ఫలించిన నిరీక్షణ.. శ్రీలంకపై భారత్ విజయం.. కెప్టెన్‌గా కోహ్లీకి తొలి సిరీస్

శ్రీలంకపై భారత్ విజయభేరీ మోగించింది. దీంతో 22 యేళ్ళ భారత్ నిరీక్షణకు తెరపడింది. శ్రీలంకను వారి సొంతగడ్డపై టీమిండియా 22 యేళ్ళ తర్వాత ఓడించి సిరీస్‌ను సొంతంచేసుకుంది. ఈ విజయంలో భారత పేసర్ ఇషాంత్ శర్మ కీలక పాత్ర పోషించారు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు, రెండో ఇన్నింగ్స్‌లో కీలకమైన మూడు వికెట్లు నేలకూల్చి జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. అలాగే, భారత కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన విరాట్ కోహ్లీకి తొలి సిరీస్ విజయం ఇదే కావడం గమనార్హం. తాను పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చేపట్టిన తొలి విదేశీ పర్యటన కూడా ఇదే.
 
 
ఈ మ్యాచ్‌లో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 312 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇందులో ఓపెనర్ పుజారా (145), అమిత్ మిశ్రా (59)లు అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో భారత్ ఈ మాత్రం స్కోరు చేయగలిగింది. ఆ తర్వాత శ్రీలంక తన తొలి ఇన్నింగ్స్‌లో 201 పరుగులు చేసింది. శ్రీలంక జట్టులో పెరేరా (55), హెరాత్ (49)లు మాత్రమే చెప్పుకోదగిన స్కోరు చేశారు. దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 111 పరుగుల కీలకమైన ఆధిక్యం లభించింది. 
 
ఆ తర్వాత భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో 274 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని కలుపుకుని శ్రీలంక ముంగిట 386 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని నిర్ధేశించింది. ఈ లక్ష్యాన్ని చేధించే క్రమంలో నాలుగో సాయంత్రం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 21 పరుగులకే మూడు ప్రధానమైన వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత చివరి రోజైన మంగళవారం నాలుగో రోజు ఓవర్ నైట్ స్కోరు 67/3తో బ్యాటింగ్ చేపట్టిన లంకేయులు... 268 పరుగులకు ఆలౌట్ అయ్యారు. ఫలితంగా భారత్ 117 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. లంక జట్టులో మ్యాథ్యూస్ (110) సెంచరీతో ఒంటరిపోరాటం చేసిన జట్టును ఓటమి కోరల నుంచి రక్షించలేకపోయారు. 
 
శ్రీలంక ఆటగాళ్లను కట్టడి చేయడంలో భారత పేసర్ ఇషాంత్ శర్మ కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో మూడు ప్రధాన వికెట్లు తీసి లంకేయులను కోలుకోని దెబ్బతీశాడు. అలాగే, రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ నాలుగు, యాదవ్ 2, అమిత్ మిశ్రా ఒక్కో వికెట్ చొప్పున తీశారు. ఫలితంగా మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును పుజారా దక్కించుకోగా, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును ఆర్ అశ్విన్ అందుకున్నాడు. 
 
జట్ల సంక్షిప్త స్కోర్లు... 
భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరు... 312
(పుజరా 145, అమిత్ మిశ్రా 59). 
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ స్కోరు... 201
(పెరేరా 55, హెరాత్ 49). 
భారత్ రెండో ఇన్నింగ్స్ స్కోరు... 274
(రోహిత్ శ్రమ 50, అశ్విన్ 58, బిన్నీ 49). 
శ్రీలంక రెండో ఇన్నింగ్స్ స్కోరు... 268
(మ్యాథ్యూస్ 110, పెరేరా 70). 
మ్యాచ్ ఫలితం .. 117 పరుగులతో భారత్ గెలుపు.