గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 26 మార్చి 2015 (14:33 IST)

రసవత్తరంగా భారత్ ఛేజింగ్.. శిఖర్ ధావన్ - విరాట్ కోహ్లీ ఔట్!

ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీ ఫైనల్లో భారత్ తన తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆరంభంలోనే జీవదానం పొందిన శిఖర్ ధావన్ దాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయాడు. ఫలితంగా తన వ్యక్తిగత స్కోరు 45 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. ఇందులో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ ఉంది. అప్పటికి భారత్ స్కోరు 12.5 ఓవర్లలో 71 పరుగులు. శిఖర్ ధావన్ ఔట్ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ కూడా కేవలం ఒక్కటంటే ఒక్క పరుగు చేసి కీపర్ బ్రాడ్ హ్యాడ్డిన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికి భారత్ స్కోరు 15.3 ఓవర్లలో 78 పరుగులు. 
 
అయితే, ఈ మ్యాచ్ రసవత్తరంగా మారింది. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయినప్పటికీ, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ధాటిగా ఆడటంతో, రన్ రేట్ ఏ క్షణంలో కూడా తగ్గలేదు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. దీంతో, భారత్ ముంగిట 329 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. 
 
ఫలితంగా ఈ మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన టీమిండియాకు 329 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం పెద్ద కష్టమేమీ కానప్పటికీ... ఒత్తిడిని తట్టుకుని, ఆస్ట్రేలియా క్రికెటర్ల స్లెడ్జింగ్‌తో టెన్షన్‌కు గురికాకుండా ఏ మేరకు రాణిస్తారనేది ఇప్పట్లో ఆసక్తికరంగా మారింది. 
 
భారీ విజయలక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు నింపాదిగా బ్యాటింగ్ చేస్తున్నారు. జట్టు స్కోరు సున్నా పరుగుల మీద ఉన్నపుడు రోహిత్ శర్మ డకౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత శిఖర్ ధావన్ మొదటి స్లిప్‌లో ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను వికెట్ కీపర్ బ్రాడ్ హ్యాడ్డిన్ పట్టేందుకు ప్రయత్నించి నేలపాలు చేశాడు. దీంతో భారత ఓపెనర్లిద్దరూ జీవదానం పొంది బ్యాటింగ్ చేస్తున్నారు. ఆ తర్వాత శిఖర్ ధావన్ దాన్ని సద్వినియోగం చేసుకోలేక పెవిలియన్‌కు చేరాడు. 
 
అంతకుముందు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో ఫించ్ 81, వార్నర్ 12, స్మిత్ 105, మాక్స్‌వెల్ 23, వాట్సన్ 28, క్లార్క్ 10, ఫాల్కనర్ 21, హాడిన్ 7 (నాటౌట్), మిచెల్ జాన్సన్ 27 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్ 4, మోహిత్ శర్మ 2, అశ్విన్ 1 వికెట్ తీశారు.