శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 28 నవంబరు 2015 (12:52 IST)

దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు: అశ్విన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్.. పిచ్‌పై కోహ్లీ వివరణ!

దక్షిణాఫ్రికాతో నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంతో నిలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ దిగింది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌ను స్వల్ప స్కోరుకే ముగించిన కోహ్లీ సేన 215 పరుగులకే అన్నీ వికెట్లు కోల్పోయింది. తదనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికా కూడా కేవలం 79 పరుగులకే అన్నీ వికెట్లు కోల్పోయింది. 
 
రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత్ 173 పరుగులకు ఆలౌట్ కావడం, దక్షిణాఫ్రికా 185 పరుగుల కట్టడి కావడంతో భారత్ 124 పరుగుల తేడాతో విజయం సాధించింది. నాగ్‌పూర్ పిచ్‌పై కొండలా కనిపించిన 310 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 185 పరుగులు మాత్రమే చేయగలిగింది. సఫారీ బ్యాట్స్‌మెన్లు ఎంత నిలకడగా ఆడినా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెలరేగడంతో ఓటమిని చవిచూశారు. తొమ్మిదేళ్లు విదేశాల్లో అజేయ రికార్డును కొనసాగించిన దక్షిణాఫ్రికా జట్టును భారత్ ఓడించింది. 
 
ఇకపోతే.. తన ఐదు వేళ్లతో ఎరుపు రంగు బంతిని గిరగిరా తిప్పుతూ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 12 వికెట్లు తీసిన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. 4 టెస్టుల సిరీస్‌లో ఇండియా 2-0 ఆధిక్యంతో నిలిచి సిరీస్‌ను కైవసం చేసుకోగా, పిచ్ లను తీర్చిదిద్దిన తీరు అసంతృప్తిని కలిగించిందని, మ్యాచ్ ప్రజెంటేషన్ సందర్భంగా దక్షిణాఫ్రికా కెప్టెన్ హషీమ్ ఆమ్లా వ్యాఖ్యానించారు. 
 
భారత్ లో పర్యటన తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నాడు. భారత ఆటగాళ్లు టెస్టు సిరీస్ లో అద్భుతంగా ఆడారని కితాబిచ్చాడు. ఇక భారత కెప్టెన్ మాట్లాడుతూ.. టీ20, వన్డే సిరీస్ లను గెలుచుకోలేకపోయినప్పటికీ, టెస్టు సిరీస్ లో మంచి ప్రతిభను కనబరుస్తూ సాగుతుండటం సంతోషకరమన్నాడు. భారత్ పిచ్‌లపై ఇంత రాద్ధాంతం ఎందుకని ప్రశ్నించాడు. తాము విదేశాల్లో ఆడినప్పుడు అక్కడి పరిస్థితుల గురించి ఫిర్యాదు చేయలేదు. ఇకపైనా చేయం. దక్షిణాఫ్రికాపై రికార్డు విజయాన్ని నమోదు చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నాడు.