శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 27 నవంబరు 2015 (15:45 IST)

నాగ్‌పూర్ టెస్ట్ మ్యాచ్ : దక్షిణాఫ్రికా స్పిన్‌తో కళ్లెం.. 124 రన్స్‌తో భారత్ విజయం

నాగ్‌పూర్‌లో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు విజయాన్ని సాధించింది. స్పిన్‌కు అచ్చొచ్చిన ఈ పిచ్‌పై భారత స్పిన్నర్లు అద్భుతంగా రాణించడంతో కోహ్లీ సేన 124 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. ఫలితంగా నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-0తో ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది.
 
ఈ మ్యాచ్‌లో 310 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు తన రెండో ఇన్నింగ్స్‌లో 89.5 ఓవర్లలో 185 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఉప ఖండపు స్పిన్ పిచ్‌లపై పెద్దగా అనుభవం లేని సౌతాఫ్రికా ఆటగాళ్లు తెల్లమొహం వేశారు. ఈ మ్యాచ్‌లో డుప్లెసిస్, ఆమ్లాల చెరో 39 పరుగులు మినహా మరెవరూ రాణించలేకపోయారు. భారత బౌలర్లలో అశ్విన్‌కు 7 వికెట్లు లభించగా, మిశ్రాకు 3 వికెట్లు లభించాయి.
 
అంతకుముందు రెండో రోజు ఓవర్ నైట్ స్కోరు 32/2 పరుగులతో మూడో రోజు ఆటను ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టు... మరో రెండు వికెట్లను జట్టు స్కోరు 58 పరుగుల్లోపు కోల్పోయింది. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన ఆమ్లా (39), ప్లెసిస్‌ (39)లు జట్టును ఓడ్డుకు చేర్చే బాధ్యతలను స్వీకరించారు. ఫలితంగా వీరిద్దరు కలిసి 72 పరుగుల అత్యంత అమూల్యమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరు క్రీజ్‌లో ఉన్నంత సేవు భారత బౌలర్లు తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యారు.
 
ఈ క్రమంలో ఆమ్లా.. అమిత్ మిశ్రా బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికి సఫారీల స్కోరు 130/5. ఆ తర్వాత మరో ఐదు పరుగుల వ్యవధిలో డుప్లెసిస్ కూడా ఔట్ కావడంతో భారత ఆటగాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత డుమ్నీ 19, విలాస్ 12, హార్మెర్ 8 (నాటౌట్), రబడా 1, మోర్కెల్ 4 చొప్పున పరుగులు చేశారు. ఈ టెస్ట్ మ్యాచ్‌లో ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా 50 పరుగులు కూడా చేయలేక పోయారు.
 
టెస్ట్ మ్యాచ్ సంక్షిప్త స్కోరు 
భారత్ తొలి ఇన్నింగ్స్ : 215 
(హార్మర్ 4, మోర్కెల్ 3 వికెట్లు)
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్ : 79 
(అశ్విన్ 5, జడేజా 4 వికెట్లు)
భారత్ రెండో ఇన్నింగ్స్ : 173
(తాహీర్ 5, మోర్కెల్ 3 వికెట్లు)
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ : 185
(అశ్విన్ 7, మిశ్రా 3 వికెట్లు)
124 రన్స్ తేడాతో భారత్ గెలుపు.