గురువారం, 28 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 24 ఆగస్టు 2015 (13:20 IST)

కొలంబో టెస్టులో శ్రీలంకపై భారత్ ఘన విజయం.. లెక్క సమం...

శ్రీలంక పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు కొలంబో వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ నిర్ధేశించిన 412 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని చేధించే క్రమంలో శ్రీలంక జట్టు తన రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 134 పరుగులకే ఆలౌట్ అయింది. భారత స్పిన్నర్లు అశ్విన్ (5 వికెట్లు), అమిత్ మిశ్రా (3 వికెట్లు) అద్భుతంగా రాణించి.. శ్రీలంక జట్టును కట్టడిచేశారు. ఫలితంగా మూడు టెస్ట్ మ్యాచ్‌లో సిరీస్‌లో ఇరు జట్లూ 1-1తో సమ ఉజ్జీలుగా ఉన్నాయి. ఈనెల 28వ తేదీ నుంచి ఇరు జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ ఆరంభంకానుంది.
 
 
అంతకుముందు.. 412 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. చివరి రోజైన సోమవారం ఉదయం బ్యాటింగ్‌ చేపట్టిన తర్వాత కేవలం 65 పరుగుల తేడాతో ఎనిమిది వికెట్లను చేజార్చుకుంది. ఫలితంగా భారత్ 278 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 
 
అంతకుముందు భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 393 పరుగులు చేయగా, శ్రీలంక జట్టు 306 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. దీంతో శ్రీలంక జట్టు ముంగిట 412 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఉంచినట్టయింది. అయితే, లంక జట్టు ఈ లక్ష్యాన్ని చేరుకోలేక చేతులెత్తేసింది. కాగా, ఈ మ్యాచ్‌లో గెలిచి తన కెరీర్‌లో చివరి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న కుమార సంగక్కరకు అంకితమివ్వాలని లంకేయులు భావించగా, కోహ్లీ సేన దానని అడ్డుకుని లెక్క సమం చేసింది. అలాగే, టెస్ట్ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి ఇది తొలి విజయం. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కేఎల్ రాహుల్‌ను వరించింది.