శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 27 ఏప్రియల్ 2015 (11:19 IST)

ఆ మ్యాచ్ రద్దు.. చెన్నై డౌన్.. రాజస్థాన్ అప్.. అంకిత్‌కు రూ.10లక్షలు!

కోల్‌కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య ఆదివారం జరగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. భారీ వర్షం కురవడంతో మైదానాన్ని కవర్లతో కప్పివుంచారు. సూపర్ సోకర్స్‌ను ఉపయోగించి అక్కడక్కడా నిలిచిపోయిన నీటిని తొలగించారు. కనీసం పది, అదీ కుదరకపోతే ఐదు ఓవర్లతో మ్యాచ్‌ని జరిపించాలని నిర్వాహకులు అనుకున్నారు. 
 
అయితే, అవుట్‌ఫీల్డ్ బురదతో నిండిపోవడంతో అది సాధ్యం కాలేదు. పలుమార్లు మైదానాన్ని పరిశీలించిన ఫీల్డ్ అంపైర్లు ఆర్‌ఎం దేశ్‌పాండే, ఆర్‌కే ఇల్లింగ్‌వర్త్, ఇరు జట్ల కెప్టెన్లు గౌతం గంభీర్, షేన్ వాట్సన్, కోచ్‌లు, పాడే అప్ట్రాన్, రాహుల్ ద్రవిడ్, ఇతర అధికారులు ఆటను కొనసాగించే అవకాశం లేదని నిర్ణయానికి వచ్చారు. అనంతరం మ్యాచ్‌ని రద్దు చేస్తున్నట్టు ఐపిఎల్ కమిటీ అధికారికంగా ప్రకటించింది. 
 
మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ వచ్చాయి. రాజస్థాన్‌కు ఇది కలిసి వచ్చింది. పది పాయింట్లు సాధించిన చెన్నై సూపర్ కింగ్స్‌ను వెనక్కి నెట్టి 11 పాయింట్లతో రాజస్థాన్ రాయల్స్ అగ్రస్థానానికి చేరుకుంది. ఏడు పాయింట్లతో కోల్‌కతా నైట్ రైడర్స్ మూడో స్థానంలో నిలిచింది. 
 
ఇటీవల ఒక క్లబ్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడి, ఆతర్వాత మృతి చెందిన యువ బ్యాట్స్‌మన్ అంకిత్ కేసరికి కోల్‌కతా నైట్ రైడర్స్ నివాళులర్పించింది. అంకిత్ పేరును 16 మంది సభ్యులతో కూడిన జట్టులో చేర్చి అతని పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకుంది. అంకిత్ కుటుంబానికి 10 లక్షల రూపాయల చెక్కును అందచేసింది.