శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 6 ఫిబ్రవరి 2016 (11:30 IST)

ఐపీఎల్ సీజన్ 9: వేలంపాటలో యువీకి ఆశించిన ధర రాలేదు.. రూ.7 కోట్లకే?

కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ 9వ సీజన్‌కు గాను వేలం పాట మొదలైంది. ఈ వేలంలో టీమిండియా స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు ఆశించిన ధర లభించలేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాదు జట్లు యువీ కోసం హోరాహోరీగా పోరాడినా, అతడికి గత సీజన్‌లో లభించిన ధరలో సగం కూడా దక్కకపోవడం గమనార్హం. 
 
శనివారం ఉదయం బెంగళూరులో ప్రారంభమైన వేలంలో సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు యువీని కేవలం రూ.7 కోట్లకు దక్కించుకుంది. గత సీజన్‌లో యువీకి ఏకంగా రూ.16 కోట్ల ధర లభించింది. అంతకుముందు వేలంలో అతడికి రూ.12 కోట్లు లభించాయి. తాజా వేలంలోనూ యువీకి భారీ ధర పలుకుతుందని భావించినా, కేవలం రూ.7 కోట్లకే అతడిని సన్ రైజర్స్ యాజమాన్యం సొంతం చేసుకోవడం గమనార్హం. 
 
ఇకపోతే..ఐపీఎల్ తాజా సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు అదృశ్యం కాగా... వాటి స్థానంలో రాజ్ కోట్, పూణే జట్లు రంగంలోకి దిగనున్నాయి. తాజా ఐపీఎల్ సీజన్‌కు సంబంధించి శనివారం బెంగళూరులో ఆటగాళ్ల వేలం ప్రారంభమైంది. మొత్తం 351 మంది క్రికెటర్లు ఈ వేలానికి అందుబాటులో ఉంటారు.