గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 26 జులై 2015 (15:00 IST)

ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసు : క్రికెటర్లపై చర్యలు యధాతథం... బీసీసీఐ

ఐపీఎల్‌ స్పాట్ ‌ఫిక్సింగ్‌ కేసులో శ్రీశాంత్‌, చండీలా, అంకిత్‌లపై మోపిన అభియోగాలను ఢిల్లీ కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో క్రికెటర్లపై నిషేధాన్ని ప్రస్తుతానికి కొనసాగిస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. కేసు కొట్టివేసినప్పటికీ క్రికెటర్లపై క్రమశిక్షణ చర్యలపై ఎలాంటి మార్పు ఉండబోదని తెలిపింది. ‘చట్ట వ్యతిరేక చర్యల పట్ల బీసీసీఐ తీసుకున్న క్రమశిక్షణ చర్యలు స్వతంత్రమైనవి. వాటిలో ఎలాంటి మార్పు ఉండద’ని బోర్డు స్పష్టంచేసింది. అదేసమయంలో ఢిల్లీ కోర్టు తీర్పు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసే దిశగా బీసీసీఐ అడుగులు వేస్తోంది.
 
కాగా, భారత క్రికెట్‌ను కుదిపేసిన ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్ బెట్టింగ్‌ కుంభకోణంలో ఢిల్లీ కోర్టు సంచలన తీర్పును శనివారం వెలువరించిన విషయంతెల్సిందే. ఈ కేసులో దోషులుగా పేర్కొన్న రాజస్థాన్‌ రాయల్స్‌ క్రికెటర్లు శ్రీశాంత్‌, అజిత్‌ చండీలా, అంకిత్‌ చవాన్‌లను నిర్దోషులుగా ప్రకటించింది. 16 మంది క్రికెటర్లు సహా 36 మందిపై ఢిల్లీ పోలీసులు మోపిన అభియోగాలను తగిన సాక్ష్యాధారాలు లేవని అందువల్ల వాటిని కొట్టివేస్తున్నట్టు పాటియాలా హౌస్‌ కోర్టు శనివారం తీర్పు ఇచ్చింది. 
 
దీంతో శాంతకుమారన్‌ శ్రీశాంత్‌, అజిత్‌ చండీలా, అంకిత్‌ చవాన్‌లకు ఊరట లభించినట్టయింది. అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం అతని అనుచరుడు చోటా షకీల్‌ సహా ఆరుగురి (పరారీలో ఉన్నారు)ని నేరస్థులుగా కోర్టు ప్రకటించింది. ఈ తీర్పు పట్ల బీసీసీఐ పెద్దలు పైవిధంగా స్పందించారు.