బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Modified: బుధవారం, 25 ఫిబ్రవరి 2015 (17:18 IST)

వరల్డ్ కప్ : ఒబ్రియాన్ వీరవిహారం... యూఏఈపై ఐర్లాండ్ విజయం!

ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా బుధవారం గ్రూపు బీ జట్లు అయిన ఐర్లాండ్, యూఏఈ జట్ల లీగ్ మ్యాచ్ బ్రిస్బేన్ క్రికెట్ మైదానంలో జరుగగా... ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ జట్టు విజయభేరీ మోగించింది. అరబ్ ఎమిరేట్స్ విధించిన 278 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఐర్లాండ్ జట్టు గెలుపొందింది. ఆ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు ఒబ్రియాన్, వికెట్ కీపర్ విల్సన్‌లు ప్రత్యర్థి జట్టు బౌలర్లపై ఎదురుదాడి చేసి భారీగా పరుగులు చేయడంతో గెలుపొందింది. 
 
279 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ జట్టుకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ స్టిర్లింగ్ మూడు పరుగులకే వెనుదిరిగాడు. మరో ఓపెనర్ ఫోర్ట్‌ఫీల్డ్ 37, జాయ్‌స్‌ 37 పరుగులు చేసి జట్టును ఆదుకున్నారు. ఆ తర్వాత ఎన్.జె. ఒబ్రియాన్ 17, బాల్‌బిర్నీ 30, విల్సన్ 80, కేఎస్ ఒబ్రియాన్ 50 చొప్పున పరుగులు చేయడంతో జట్టు విజయం సాధించింది. ముఖ్యంగా... కేఎస్ ఒబ్రియాన్ కేవలం 25 బంతుల్లో అర్థ సెంచరీ చేశాడు. ఇందులో రెండు సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి. అలాగే, విలన్స్ కూడా 69 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 80 పరుగులు చేశాడు. 
 
అంతకుముందు ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ఐర్లాండ్ జట్టు.. ప్రత్యర్థి జట్టుకు బ్యాటింగ్ అప్పగించింది. దీంతో క్రీజ్‌లోకి వచ్చిన యూఏఈ బ్యాట్స్‌మెన్లు నింపాదిగా బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలో యూఏఈ ఆటగాడు అన్వర్ మెరుపు సెంచరీతో కదం తొక్కాడు. కేవలం 83 బంతుల్లో 106 పరుగులు (10 ఫోర్లు, 1 సిక్సర్) చేసి స్కోరు బోర్డును ఉరకలెత్తించాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ వన్డేల్లో తొలి సెంచరీ నమోదు చేసిన యూఏఈ ఆటగాడిగా అన్వర్ రికార్డులకెక్కాడు. 
 
అలాగే, మిగిలిన బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్లు అంజాద్ అలీ 45, బెరెంగర్ 13, ఖుర్రం ఖాన్ 36, అంజాద్ జావెద్ 42, మొహ్మద్ నవీద్ 13లు రాణించడంతో ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి యూఏఈ 278 పరుగులు చేసింది. ఐర్లాండ్ బౌలర్లు స్టిర్లింగ్, కెవిన్ ఓబ్రెయిన్, క్యుసాక్, సోరెన్ సెన్‌లు తలా రెండు వికెట్లు తీయగా, డాక్ రెల్ ఒక వికెట్ పడగొట్టాడు.