గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 30 ఆగస్టు 2015 (16:41 IST)

కొలంబో టెస్ట్ : విజృంభించిన ఇషాంత్ శర్మ .. విలవిల్లాడిన లంకేయులు

కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత పేసర్ ఇషాంత్ శర్మ విజృంభించాడు. ఐదు వికెట్లు తీసి శ్రీలంక నడ్డి విరిచాడు. పేస్‌కు అనుకూలించిన కొలంబో పిచ్‌పై ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, స్టూవర్ట్ బిన్నీ లంక టాపార్డర్ కు చుక్కలు చూపారు. ఫలితంగా శ్రీలంక జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 201 పరుగులకు ఆలౌటైంది. 
 
శ్రీలంక ఇన్నింగ్స్‌లో పెరీరా 55 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హెరాత్ 49, ప్రసాద్ 27 పరుగులు చేశారు. ఒక దశలో ఆతిథ్య జట్టు 48 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. లంక జట్టులో ఓపెనర్ ఉపుల్ తరంగ (4), సిల్వా (3), కరుణరత్నే (11), కెప్టెన్ మాథ్యూస్ (1), తిరిమన్నే (0) దారుణంగా విఫలమయ్యారు. చాందిమల్ 23 పరుగులు చేశాడు. ప్రసాద్ (1) రిటైర్డ్ హర్ట్‌‌‌గా వెనుదిరిగాడు. ఇషాంత్‌కు తోడు బిన్నీ (2 వికెట్లు), మిశ్రా (2 వికెట్లు) కూడా రాణించడంతో టీమిండియాకు 111 పరుగుల కీలక అధిక్యం లభించింది. తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ సేన 312 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. 
 
అంతకుముందు, టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 312 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌గా బరిలో దిగిన యువకిశోరం ఛటేశ్వర్ పుజారా 145 పరుగులతో అజేయంగా నిలవడం విశేషం. లోయరార్డర్‌లో అమిత్ మిశ్రా 59 పరుగులతో ఉపయుక్తమైన ఇన్నింగ్స్ ఆడాడు. లంక బౌలర్లలో ప్రసాద్ 4, హెరాత్ 3 వికెట్లు తీశారు. ప్రదీప్, మాథ్యూస్, కౌశల్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. రెండు పరుగలుకే రెండు వికెట్లు కోల్పోయింది. శ్రీలంక బౌలర్లు టీమిండియా ఓపెనర్లు తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో పుజారా (0), రాహుల్ (2)లను క్లీన్ బౌల్డ్ చేశారు.