శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr

ఐపీఎల్ : ఓడిన హైదరాబాద్... కోల్‌కతాను గెలిపించిన గంభీర్

ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్‌ జట్టు టోర్నీలో వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. బౌలింగ్‌లో పస లేకపోవడంతో, కోల్‌కతా జట్టు కెప్టెన్ గౌతం గంభీర్ విజృంభించడంతో సన్‌రైజర్స్ ఆటగాళ్లకు తలవంచక తప్పలేదు. 
 
ఉప్పల్‌ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టులో కెప్టెన్‌ గౌతమ్‌ గంభీర్‌ (90: 60 బంతుల్లో 13×4, 1×6) అజేయ అర్థశతకం చేసి ఆదుకోవడంతో 18.2 ఓవర్లలోనే 146/2తో విజయాన్ని సొంతంచేసుకుంది. 
 
తొలుత గంభీర్‌తో పాటు ఓపెనర్‌ ఉతప్ప (38: 34 బంతుల్లో 3×4, 1×6) నిలకడగా ఆడటంతో ఛేదనలో కోల్‌కతాకు 92 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యం లభించింది. జట్టు ప్రధాన బౌలర్లు సైతం విఫలమైన వేళ బౌలింగ్‌కు వచ్చిన ఆశిష్‌ రెడ్డి తన తొలి ఓవర్‌లోనే ఉతప్పను పెవిలియన్‌కు పంపి ఆకట్టుకున్నాడు. తర్వాత వచ్చిన హిట్టర్‌ రసెల్‌ (2)ను ముస్తఫిజుర్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేయడంతో మ్యాచ్‌ ఆసక్తికరంగా మారింది. అయితే కెప్టెన్‌ గంభీర్‌ చివరి వరకూ క్రీజులో అజేయంగా నిలిచి మనీశ్‌ పాండే(11)తో కలిసి గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు. 
 
అంతకముందు.. తొలుత టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌ (6), డేవిడ్‌ వార్నర్‌ (13) తక్కువ పరుగులకే పెవిలియన్‌ చేరి అభిమానులను నిరాశపరిచారు. తొలి ఓవర్‌లోనే ఔట్‌ ప్రమాదం నుంచి తప్పించుకున్న కెప్టెన్‌ వార్నర్‌ ఆ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయాడు. 
 
దీంతో 3.2 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్‌ 23/2తో ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో మెర్గాన్‌ (51: 43 బంతుల్లో 3×4, 2×6)తో కలిసి హెన్రిక్యూస్‌ (6), దీపక్‌ హుడా (6), నమన్‌ ఓజా (37: 28 బంతుల్లో 2×4, 2×6), చివర్లో ఆశిష్‌ రెడ్డి (13) బ్యాట్‌ ఝళిపించడంతో సన్‌రైజర్స్‌ 142 పరుగులు చేయగలిగింది.