గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr

బెంగుళూరు టెస్ట్ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం.. ఒక్క బాల్ కూడా పడలేదు.. ఆట రద్దు

బెంగుళూరులో భారత్ - దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా మారాడు. ఫలితంగా రెండో రోజైన ఆదివారం ఒక్క బంతికూడా పడకుండానే ఆటను రద్దు చేశారు. దీంతో భారత ఆటగాళ్ళ దూకుడుకు వరుణుడు కళ్లెం వేసినట్టయింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సఫారీలు.. తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 214 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెల్సిందే. ఆ తర్వాత తన తొలి ఇన్నింగ్స్‌లో భారత్ వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసి తొలి రోజు ఆటను విజయవంతంగా టీమిండియా ముగించింది. 
 
ఈ పరిస్థితుల్లో శనివారం రాత్రి నుంచి బెంగళూరులో పడుతున్న వర్షానికి ఆదివారమైన రెండో మ్యాచ్లో ఒక్క బాల్ కూడా పడలేదు. ఉదయం నుంచి పలు మార్లు వర్షం పడుతూ, ఆగుతూ ఉండటంతో, పలు మార్లు అంపైర్లు పిచ్‌ని గమనించారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సైతం కాసేపు వర్షం పడింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం సిబ్బంది, గ్రౌండ్‌లోని నీటిని అత్యాధునిక పద్ధతులు ఉపయోగించి వెలుపలికి పంపుతున్నప్పటికీ, ఫలితం ఉండటం లేదు. పదే పదే పడుతున్న వాన జల్లులతో మ్యాచ్‌కు తీరని అంతరాయంగా మారింది. దీంతో రెండో రోజు ఆటను పూర్తిగా రద్దు చేశారు.