గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 2 మే 2015 (11:25 IST)

ఐపీఎల్ 8 : అంబటి రాయుడు విజృంభణ .. ముంబై విజయం!

స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ 8 పోటీల్లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు విజయభేరీ మోగించింది. ఆ జట్టు ఆటగాడు అంబటి రాయుడు విజృంభించడంతో విజయాల పరంపరతో దూసుకెళుతున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు‌కు బ్రేక్ పడింది. 
 
అదేసమయంలో విజయం కోసం ముఖం వాచిపోయిన ముంబై ఇండియన్స్‌కు అంబటి రాయుడు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. కేవలం 27 బంతుల్లోనే రాయుడు నాలుగు ఫోర్లు, మూడు సిక్స్‌లతో చెలరేగి 53 పరుగులు చేశాడు. ముంబై గెలుపులో కీలక భూమిక పోషించిన రాయుడుకే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. 
 
తొలుత టాస్ గెలిచిన రాజస్థాన్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ముంబై ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు లెండిల్ సిమ్మన్స్ (38), పార్ధీవ్ పటేల్ (23) శుభారంభాన్నిచ్చారు. ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ (27) కూడా రాణించాడు. తదనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన రాయుడు వీరవిహారం చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి ముంబై ఇండియన్స్ 187 పరుగులు చేసింది. 
 
ఆ తర్వాత 188 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లను కోల్పోయి 179 పరుగులే చేయగలిగింది. ఓపెనర్లు అజింక్యా రెహానే (16), షేన్ వాట్సన్ (28) ఫరవాలేదనిపించారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్ ముంబై బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. 46 బంతుల్లో సంజూ 76 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో రాయల్స్ విజయం ఖాయమనుకున్నారు. అయితే సంజూ ఔటైన తర్వాత రాజస్థాన్ బ్యాట్స్ మెన్ తడబడ్డారు. దీంతో చివరి దాకా ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో ముంబై 8 పరుగులతో విజయం సాధించింది.