మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By CVR
Last Updated : ఆదివారం, 1 మార్చి 2015 (18:23 IST)

వరల్డ్ కప్‌లో తొలి గెలుపు... 20 పరుగుల తేడాతో పాక్ విజయం..!

ప్రపంచ క్రికెట్ కప్ పోటీలలో పాకిస్థాన్ జట్టు ఎట్టకేలకు తొలి విజయాన్ని తన ఖాతాలో నమోదు చేసుకుంది. వన్డే ప్రపంచకప్ పూల్ - ఎ లో భాగంగా పాకిస్థాన్-జింబాబ్వేల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు 20 పరుగుల తేడాతో జింబాబ్వేపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్.. ప్రత్యర్థి జింబాబ్వే ముందు 236 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 
 
పాక్ జట్టులో మిస్బా(73), వహాబ్ రియాజ్ (54)తో రాణించారు. వారి ఇద్దరికి తోడు ఉమర్ అక్మల్ 33 పరుగులు చేయడంతో పాక్ నిర్ణీత ఓవరల్లో 7 వికెట్లకు 235 పరుగులు చేసింది. జింబాబ్వే బౌలర్లలో చటారా మూడు, విలియమ్స్ రెండు వికెట్లు తీశారు.
 
అనంతరం క్రీజ్‌పైకి దిగిన జింబాబ్వే ఆట ప్రారంభం నుంచే తటపటాయించింది. పాక్ పేసర్ ఇర్ఫాన్ జింబాబ్వే ఓపెనర్లతో పాటు మరో ఇద్దరిని అవుట్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడికి తోడు మరో బౌలర్ రియాజ్ నాలుగు వికెట్లు తీసి జింబాబ్వేను కోలుకోలేని దెబ్బతీశాడు. కాగా జింబాబ్వే జట్టులో బ్యాట్స్మెన్లో టేలర్ (50), విలియమ్స్ (33), హామిల్టన్ (29) మినహా మిగిలిన వాఎవరూ రాణించలేకపోయారు.