గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , శనివారం, 15 జులై 2017 (08:58 IST)

భారత్ గెలిచిన 2011 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఫిక్సింగా.. రణతుంగ వ్యాఖ్యపై సీనియర్ల ధ్వజం

కోట్లాది భారతీయ క్రికెట్ అభిమానులు అవమానంతో దహించుకుపోయేలా శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ ఘోరమైన వ్యాఖ్య చేసాడు. భారత్‌తో జరిగిన 2011 ప్రపంచకప్‌ ఫైనల్లో శ్రీలంక ఓటమిపై తనకు అనుమానం

కోట్లాది భారతీయ క్రికెట్ అభిమానులు అవమానంతో దహించుకుపోయేలా శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ ఘోరమైన వ్యాఖ్య చేసాడు. భారత్‌తో జరిగిన 2011 ప్రపంచకప్‌ ఫైనల్లో శ్రీలంక ఓటమిపై తనకు అనుమానం ఉందని రణతుంగ పేర్కొన్నారు. ఇందులో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కోణం ఉందని, విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ముంబైలో జరిగిన ఆ మ్యాచ్‌లో లంక ఆరు వికెట్ల తేడాతో ఓడటం తనను షాక్‌కు గురి చేసిందని అన్నారు. 
 
‘ఆ సమయంలో నేను కామెంటేటర్‌గా భారత్‌లోనే ఉన్నాను. మా జట్టు ఓడటం నన్ను బాధించింది. అలాగే ఆ ఓటమిపై నాకు అనుమానంగా ఉంది. అందుకే దీనిపై విచారణ జరగాలి. అన్ని విషయాలను నేను ఇప్పుడు వెల్లడించలేను. కానీ ఏదో ఒకరోజు ఆధారాలతో సహా బయటపెడతా. అయితే విచారణ మాత్రం జరగాలి. ఆటగాళ్లు తమ అనైతికతను కాపాడుకోలేరు’ అని రణతుంగ వీడియో సందేశం ద్వారా అన్నారు. 
 
ఇంతకూ ఇది 2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌పై కామెంటా లేక శ్రీలంక జట్టు ఒకనాటి సెలెక్టర్‌గా తన వ్యవహారంపై మరొక వెటరన్ ఆటగాడు కుమార సంగక్కర విమర్శలు గుప్పించినందుకు ప్రతిస్పందనా అనేది తెలియడం లేదు. పాకిస్తాన్‌లో సరైన భద్రత లేనప్పటికీ 2009లో లంక జట్టును అక్కడికి పంపించడంపై విచారణ జరపాలని సంగక్కర డిమాండ్‌ చేయడంతో రణతుంగ.. ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఓటమిని తెరపైకి తేవడం గమనార్హం.
 
ఏదేమైనా 28 ఏళ్ల తర్వాత  భారత్‌కు రెండో వరల్డ్ కప్ తీసుకొచ్చిన 2011 ఫైనల్ మ్యాచ్‌పై నీలినీడలు కమ్మేలా రణతుంగ మాట్లాడటం భారత్ అభిమానులను కలిచి వేసింది. ఆగ్రహంతో రగిలించింది. చివరి ఓవర్ వరకు విజయం దోబూచు లాడిన నాటి పైనల్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సిక్సర్‌తో వరల్డ్ కప్‌ను మళ్లీ సాధించిపెట్టిన విషయం తెలిసిందే.

నాటి భారత్-శ్రీలంక మ్యాచ్‌పై రణతుంగ వ్యాఖ్యానించడం ఇదే తొలిసారి కాదు. ప్రపంచ కప్ వంటి కీలక టోర్నీలో శ్రీలంక  ప్రధాన ఆటగాళ్లు గాయాలపాలై ఆటనుంచి తప్పుకోవడంలో ఏదో ఉందని అర్జున్ రణతుంగ చాలాసార్లు వ్యాఖ్యానించాడు. అయితే నాటి ప్రపంచ కప్‌లో పాల్గొన్న గౌతమ్ గంభీర్, ఆశిష్ నెహ్రాలు రణతుంగ వ్యాఖ్యలపై మండిపడ్డారు. తన వ్యాఖ్యలను అస్సలు పట్టించుకోవద్దని వీరు చెప్పారు.