శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 30 మార్చి 2015 (14:21 IST)

విరాట్ కోహ్లీకి యువరాజ్ సింగ్ మద్దతు: పర్సనల్ లైఫ్‌ను గౌరవించాలి!

విరాట్ కోహ్లీకి యువరాజ్ సింగ్ మద్దతు పలికాడు. ప్రపంచ కప్ టోర్నీ సెమీఫైనల్లో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మెరుగ్గా రాణించకపోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ టోర్నీ సెమీ ఫైనల్లో విఫలమైన భారత యువ ఆటగాడు విరాట్ కోహ్లీకి ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ట్విట్టర్ ద్వారా తన మద్దతుగా తెలియజేశాడు. త్వరలోనే కోహ్లీ తన ఫాంను కొనసాగిస్తాడని, భారత విజయాల్లో కీలక భూమిక పోషిస్తాడని యువరాజ్ ఆకాంక్షించాడు.
 
విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచులో కేవలం ఒక పరుగు మాత్రమే చేసి ఔటైన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటి, కోహ్లీ ప్రియురాలు అనుష్క శర్మ ఆ మ్యాచ్ జరుగుతున్న సిడ్నీ క్రికెట్ మైదానంలో ఉండటమే కోహ్లీ విఫలం కావడానికి కారణమని పలువురు సామాజిక మాధ్యమాల్లో దుయ్యబట్టారు. అయితే అభిమానులు ఈ విధంగా చేయడం సరికాదని 2011 ప్రపంచ కప్ హీరో యువరాజ్ హితవు పలికాడు. 
 
టోర్నీలో పాకిస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచులో కోహ్లీ శతకంతో ప్రారంభించాడని, ఆ మ్యాచులో ధోనీ నేతృత్వంలోని టీమిండియా 76 పరుగులతో గెలిచిందని గుర్తు చేశాడు. ప్రపంచ కప్ టోర్నీలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచులో సెంచరీ చేసిన ఏకైక భారత ఆటగాడు కోహ్లీ అని తెలిపాడు.
 
కాగా, కోహ్లీకి క్రికెట్, సినీ ప్రముఖుల నుంచే కాక, ప్రజల నుంచి కూడా మద్దతు లభించింది. ఇప్పటికే భారత మాజీ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్‌లు కోహ్లీకి అండగా నిలువగా.. ఇప్పుడు యువరాజ్ కూడా తన మద్దతును కోహ్లీకి తెలియజేశాడు. ప్రస్తుతం టీమిండియాలో ఉన్న స్టార్ ఆటగాళ్లలో ఒకడైన విరాట్ కోహ్లీని, అతని వ్యక్తి జీవితాన్ని గౌరవించాలని యువరాజ్ అభిమానులను కోరారు.