బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 1 ఫిబ్రవరి 2016 (16:21 IST)

అండర్‌-19 ప్రపంచకప్‌: నేపాల్‌పై భారత్‌ ఘనవిజయం

అండర్‌-19 ప్రపంచకప్‌లో యువభారత్‌ హవా కొనసాగుతోంది. ఈ టోర్నీలో ఇప్పటికే క్వార్టర్‌ ఫైనల్‌కు చేరిన భారత్‌... నామమాత్రమైన మూడో వన్డేలోనూ ఆతిథ్య జట్టు నేపాల్‌పై ఘనవిజయం సాధించింది. పొగమంచు కారణంగా ఆలస్యం కావడంతో మ్యాచ్‌ను 48 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన నేపాల్‌ నిర్ణీత 48 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 169 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అవేష్‌ ఖాన్‌ 3, మయాంక్‌ డాగర్‌ 2, వాషింగ్టన్‌ సుందర్‌ 2 వికెట్లు తీశారు. 
 
అనంతరం 170 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 18.1 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. ఓపెనర్లు రిషబ్‌ పంత్ ‌(72), ఇషాన్‌ కిషన్ ‌(52) నేపాల్‌ బౌలర్లపై ఎదురుదాడి చేయడంతో భారత్‌ విజయం ఖాయమైంది. వీరిద్దరూ తొలివికెట్‌కు 124 పరుగులు జోడించారు. అనంతరం స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయిన జట్టును సర్ఫరాజ్‌ ఖాన్‌ (21 నాటౌట్‌), అర్మాన్‌ జాఫర్ ‌(12 నాటౌట్‌) విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో గ్రూప్‌-డిలో భారత్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఈ గ్రూప్‌లో రెండు విజయాలు సాధించిన నేపాల్‌ కూడా క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది.