శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 24 ఏప్రియల్ 2015 (10:09 IST)

మాస్టర్ బ్లాస్టర్ కొత్త అవతారం... నటుడైన సచిన్ టెండూల్కర్..!

క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కొత్త అవతారం ఎత్తారు. ఒక డాక్యుమెంటరీ కోసం నటుడయ్యాడు. మొన్నటిదాకా క్రికెట్ మైదానంలో పరుగుల వరద పారించిన సచిన్, ఆ తర్వాత చట్టసభ సభ్యుడిగా అవతారం ఎత్తాడు. అనంతరం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను దక్కించుకున్నారు. అంతటితో ఆగక నెల్లూరు జిల్లాలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధికి కొత్త నిర్వచనం ఇచ్చేందుకు మాస్టర్ బ్లాస్టర్ శ్రమిస్తున్నాడు. 
 
తాజాగా ఆయన నటుడిగానూ సరికొత్త అవతారం ఎత్తాడు. సచిన్ జీవిత చరిత్ర ఆధారంగా ఓ డాక్యుమెంటరీ-ఫీచర్ సినిమా రూపొందుతోంది. ఇందు కోసం ముఖానికి రంగేసుకుని కెమెరా ముందుకు వచ్చేశాడు. ప్రముఖ హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ ఎర్ స్కిన్ దర్శకత్వం వహిస్తున్న ఈ డాక్యుమెంటరీలో సచిన్ తన వ్యక్తిగత సామాగ్రితో కెమెరా ముందుకు వచ్చాడు.
 
కాగా ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ డాక్యుమెంటరీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తుందని సమాచారం. పలు రంగాలలో పాదం మోపే మాస్టర్ బ్లాస్టర్ ఇంకా మరెన్ని రికార్డులు సృష్టిస్తారో వేచి చూడాలి.