శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 24 ఫిబ్రవరి 2015 (16:46 IST)

భార్యను బాత్రూంలో దాచివుంచిన పాక్ స్పిన్నర్ సక్లాయిన్ ముస్తాక్!

1999 ప్రపంచ కప్ నాటికి ప్రపంచ కప్ స్మృతులను పాకిస్థాన్ స్పిన్నర్ సక్లాయిన్ ముస్తాక్ తాజాగా వెల్లడించారు. భార్యను వదిలి ఉండలేని సక్లాయిన్... పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆదేశాలను ఉల్లఘించి తన భార్యను హోటల్ బాత్రూంలో దాచివుంచినట్టు చెప్పారు. అలా ప్రపంచ కప్ పోటీలు ముగిసేంత వరకు ఇదే పని చేసినట్టు వెల్లడించారు.
 
సాధారణంగా విదేశాల్లో సిరీస్‌లు ఆడేటప్పుడు భార్యలు, స్నేహితురాళ్లు వెంట ఉంటే ప్రోత్సాహకరంగా ఉంటుందని క్రికెటర్లు భావిస్తుంటారు. సక్లాయిన్ ముస్తాక్ కూడా అలాంటివాడే. 1999 వరల్డ్ కప్‌లో ఆడేందుకు పాక్ జట్టు ఇంగ్లండ్ వెళ్లింది. టోర్నీలో కొన్ని మ్యాచ్‌లకు వరకు క్రికెటర్ల వెంట వారి భార్యలు, స్నేహితురాళ్లు ఉండేందుకు అనుమతించిన పాక్ జట్టు మేనేజ్మెంట్ సెమీఫైనల్ దశ నుంచి ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. క్రికెటర్ల వెంట ఎవరూ ఉండరాదంటూ ఆదేశాలు జారీ చేసింది.
 
అయితే, అప్పటి వరకు భార్య సనా సాహచర్యాన్ని ఎంతగానో ఆస్వాదిస్తున్న సక్లాయిన్‌కు ఈ నిర్ణయం రుచించలేదు. కానీ, మేనేజ్మెంట్ ఆదేశాలను బహిరంగంగా వ్యతిరేకించలేని పరిస్థితి! చివరకు, భార్యను వెంటే ఉంచుకోవాలని, అయితే, ఇతరులకు తెలియనివ్వకూడదని అనుకున్నాడు. జట్టు బస చేసే హోటళ్ల వివరాలు ఆమెకు అందజేసేవాడట. సక్లాయిన్ కన్నా ఆమె ముందే అక్కడకు వెళ్లేదట. ఇక కోచ్, మేనేజర్ తనను పిలిచేందుకు వస్తే... భార్యను కప్ బోర్డుల్లో, బాత్రూంలలో దాక్కోమని సలహా ఇచ్చేవాడినని సక్లాయిన్ తాజాగా ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు.