శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By chitra
Last Modified: మంగళవారం, 9 ఫిబ్రవరి 2016 (16:09 IST)

స్టీవ్ వా అంటే నాకు నచ్చదు.. సెల్ఫిష్ క్రికెటర్, 10 ఏళ్లు బాధపడ్డా: షేన్ వార్న్

ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్, మాజీ కెప్టెన్ స్టీవ్ వాపై స్పిన్ దిగ్గజం షేన్‌వార్న్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. తాను ఇప్పటివరకూ చూసిన క్రికెటర్లలో స్టీవ్ వా అంత స్వార్థపరుడిని చూడలేదని షేన్‌వార్న్ పేర్కొన్నాడు. ఓ టీవీ ఛానల్‌లో 'ఐయామ్ ఏ సెలబ్రిటీ' కార్యక్రమానికి హాజరైన షేన్ వార్న్ మాట్లాడుతూ అతడ్ని తాను ఇష్టపడకపోవడానికి చాలా కారణాలున్నాయని చెప్పారు. స్టీవ్ వాను అత్యంత స్వార్థపరుడిగా పేర్కొన్న వార్న్ 1999లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ గురించి ఓసారి గుర్తు తెచ్చుకున్నాడు.
 
వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో భాగంగా చివరి టెస్టు మ్యాచ్‌కు తనను స్టీవ్ దూరం చేశాడని షేన్ వార్న్ చెప్పాడు. ఆ మ్యాచ్‌కు దూరం కావడం తననెంతో నిరాశకు గురిచేసిందన్నాడు. ఆ టెస్టు మ్యాచ్‌లో గెలిస్తేనే ట్రోఫీ దక్కించుకునే అవకాశం ఉండేది కానీ.. నీవు ఆ మ్యాచ్‌లో ఆడట్లేదని స్టీవ్ చెప్పాడు. ఎందుకని ప్రశ్నిస్తే.. కెప్టెన్‌గా చెప్తున్నానని ధిక్కారంగా సమాధానమిచ్చాడు. 
 
కాగా ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ బౌలర్లలో ఒకడైన షేన్ వార్న్‌ను ఆ మ్యాచ్ నుంచి తొలగించడంతో జట్టులోని తోటి ఆటగాళ్లు కూడా కాస్తంత నిరాశ చెందారు. ఆ నిర్ణయంతో తన జీవితకాలంలో సుమారు 10 సంవత్సరాల పాటు నిరాశకు గురయ్యానని వార్న్ తెలిపాడు. అదే సమయంలోనే తన భుజానికి ఆపరేషన్ జరగడం తనని మరింత బాధించిందని చెప్పుకొచ్చాడు.