శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By CVR
Last Updated : మంగళవారం, 3 మార్చి 2015 (17:07 IST)

201 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై దక్షిణాఫ్రికా గెలుపు...!

ప్రపంచ వరల్డ్ కప్ గ్రూప్-బి క్రికెట్ మ్యాచ్‌లలో దక్షిణాఫ్రికా జట్టు 201 పరుగులతో ఐర్లాండ్పై గెలుపొందింది. 412 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఐర్లాండ్ 45 ఓవర్లలో 210 పరుగులకు అన్ని వికెట్లను కోల్పోయింది. దక్షిణాఫ్రికా బౌలర్లు అబాట్, స్టెయిన్ ఐర్లాండ్ను చావుదెబ్బ తీశారు. అబాట్ 4, స్టెయిన్ 2 వికెట్లు తీశారు. ఐర్లాండ్ ఆరంభంలోనే 48 పరుగులకే 5 వికెట్లు కోల్పోవడంతో దాదాపుగా ఓటమిని ఖరారు చేసుకుంది. 
 
బాల్బిర్నె(58), కెవిన్ ఒబ్రెయిన్ (48) మినహా ఇతర ఆటగాళ్లు రాణించలేకపోయారు. వీరిద్దరూ ఆరో వికెట్కు 81 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో ఐర్లాండ్ ఓటమి కాస్త ఆలస్యమైంది. ఆమ్లాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ మ్యాచ్‌లో హషిమ్ ఆమ్లా, డుప్లెసిస్ శతకాలకు తోడు రోసో, మిల్లర్ మెరుపు ఇన్నింగ్స్ జతకావడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 411 పరుగులు చేసింది. 12 పరుగులకే తొలి వికెట్ నష్టపోయిన సఫారీ టీమ్ ను ఆమ్లా, డుప్లెసిస్ శతకాలతో భారీ స్కోరు బాట పట్టించారు. దక్షిణాఫ్రికా జట్టు తరపున ప్రపంచకప్‌లో రెండో వికెట్‌కు వీరిద్దరూ రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. 
 
డుప్లెసిస్ 109 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్ తో 109 పరుగులు చేశాడు. ఆమ్లా 128 బంతుల్లో 16 ఫోర్లు, 4 సిక్సర్లతో 159 పరుగులు చేశాడు. చివర్లో రోసో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.  30 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులు చేశారు. మిల్లర్ (46, 23 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అతడికి తోడుగా నిలిచాడు.