బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 11 అక్టోబరు 2015 (17:09 IST)

కాన్పూర్ వన్డే : శతక్కొట్టిన రోహిత్ శర్మ.. ఓడిన భారత్.. 5 రన్స్‌తో సౌతాఫ్రికా విజయం

కాన్పూర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ వృధా అయింది. అత్యంత కీలక ఇన్నింగ్స్‌ ఆడినప్పటికీ.. భారత్ ఓడిపోయింది. టెయిల్ ఎండ్ బ్యాట్స్‌మెన్లు వికెట్లను సమర్పించుకోవడంతో భారత్ 5 పరుగుల తేడాతో సఫారీల చేతిలో ఓడిపోయారు. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు బ్యాటింగ్ ఎంచుకున్న విషయం తెల్సిందే. నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. 
 
ఆ తర్వాత 304 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే ధవాన్ రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టైలిష్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మతో కలిసి శిఖర్ ధావన్ తన వ్యక్తిగత స్కోరు 23 పరుగుల వద్దే వికెట్‌ను కోల్పోయాడు. మోర్నీ మోర్కెల్ వేసిన ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ మూడో బంతికి ధావన్ వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో 42 పరుగుల వద్దే టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన రహానే.. రోహిత్‌తో కలిసిన భాగస్వామ్యం శతకం నెలకొల్పారు. వీరిద్దరు రెండో వికెట్‌కి 149 పరుగుల అత్యంత కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇందులో రహానే 60, రోహిత్ శర్మ 80 పరుగులు ఉన్నాయి. రహానే 60 పరుగుల వద్ద ఔట్ అయ్యారు. 
 
ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ కూడా కేవలం 11 పరుగులకే వికెట్ కోల్పోయాడు. అప్పటికి భారత్ స్కోరు 39.6 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. అయితే, రోహిత్ శర్మ 98 బంతుల్లో వంద పరులుగు చేశాడు. ఇందులో 11 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. 
 
కోహ్లీ ఔట్ అయ్యాక ధోనీ క్రీజ్‌లోకి వచ్చాడు. ధోనీతో కలిసి రోహిత్ శర్మ మరింతగా రెచ్చిపోయాడు. 132 బంతుల్లో 13 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 150 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇదే స్కోరు వద్ద రోహిత్ శర్మ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత సురేష్ రైనా 3, ధోనీ 31, స్టువర్ట్ బిన్నీ 2 పరుగుల వద్ద వరుసగా వికెట్లు కోల్పోయారు. అప్పటికి భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. దీంతో దక్షిణాఫ్రికా 5 పరుగుల తేడాతో విజయభేరీ మోగించారు. ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో సఫారీలో 1-0తో ఆధిక్యాన్ని కూడబెట్టుకున్నారు.
 
 
అంతకుముందు.. దక్షిణాఫ్రికా జట్టు 303 పరుగులు చేసింది. ముఖ్యంగా దక్షిణాఫ్రికా వన్డే జట్టు కెప్టెన్ డివిల్లియర్స్ సెంచరీతో చెలరేగిపోవడంతో భారీ స్కోరు సాధ్యమైంది. వాస్తవానికి 41 ఓవర్ల దాకా నెమ్మదిగా సాగిన సఫారీల బ్యాటింగ్ ఆ తర్వాత ఊపందుకుంది. జట్టు స్కోరు 200 మైలు రాయి దాటగానే అప్పటిదాకా కాస్త నింపాదిగా ఆడిన డివిల్లియర్స్ ఒక్కసారిగా చెలరేగిపోయాడు. 43వ ఓవర్ ముగిసేసరికి 58 పరుగుల వ్యక్తిగత స్కోరుతో క్రీజులో ఉన్న డివిల్లియర్స్ మరో 7 ఓవర్లు ముగిసేసరికి తన స్కోరును సెంచరీ దాటించి 104 పరుగులకు చేర్చుకున్నాడు. అదేవిధంగా జట్టు స్కోరును కూడా అతడు 303 పరుగులకు చేర్చాడు.
 
ముఖ్యంగా.. భారత బౌలర్లను ఉతికిఆరేశాడు. సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డారు. ఇన్నింగ్స్ చివరి బంతిని సైతం సిక్సర్‌గా మలిచిన డివిల్లియర్స్.. 73 బంతుల్లో 104 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. డివిల్లియర్స్ తన ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, ఆరు సిక్స్‌లు ఉన్నాయి. డివిల్లియర్స్‌కు వన్డేల్లో ఇది 21వ వ్యక్తిగత సెంచరీ. 
 
డేవిడ్ మిల్లర్ (13) ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన జేపీ డుమిని (15) స్వల్ప స్కోరుకే వెనుదిరగగా, అతడి స్థానంలో బరిలోకి దిగిన బెహ్రదీన్ (35) కెప్టెన్‌కు మంచి సహకారం అందించాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో సఫారీలు ఐదు వికెట్ల నష్టానికి 303 పరుగులు చేశారు. అంతకుముందు సఫారీ ఓపెనర్లు కాక్ 29, ఆమ్లా 37, ప్లెసిస్ 62 చొప్పున పరుగులు చేశారు. భారత బౌలర్లలో అమిత్ మిశ్రా, యాదవ్‌లు రెండేసి వికెట్లు తీయగా, అశ్విన్ ఓ వికెట్ తీశాడు.