గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (16:00 IST)

వెస్టిండీస్ 151 ఆలౌట్.. దక్షిణాఫ్రికా 257 రన్స్ తేడాతో విజయభేరీ!

వరల్డ్ కప్ టోర్నీలో గ్రూపు బి జట్ల మధ్య శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో వెస్టిండీస్ చిత్తుగా ఓడిపోయింది. దక్షిణాఫ్రికా నిర్ధేశించిన 408 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని చేధించే క్రమంలో కరేబియన్లు 33.1 ఓవర్లలో 151 పరుగులకే ఆలౌట్ అయ్యారు. దీంతో సఫారీ జట్టు రికార్డు విజయం సాధించింది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 408 పరుగులు చేసిన విషయం తెల్సిందే. తొలుత సఫారీల ఇన్నింగ్స్‌ను హషీమ్ ఆమ్లా, డికాక్‌తో కలిసి ప్రారంభించాడు. అయితే ఆరో ఓవర్‌లోనే సఫారీ ఓపెనర్ డికాక్ (12) జాసన్ హోల్డింగ్ బౌలింగ్‌లో ఓటయ్యాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన ఆమ్లా 65, ప్లెసిస్ 62 పరుగులతో ఇన్నింగ్స్‌కు చక్కదిద్దారు. 
 
వీరిద్దరు రెండో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం కల్పించారు. వీరి తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన రోస్సో 61 వద్ద ఔట్ కాగా, డీ విల్లియర్స్ 162 పరుగులు చేయగా, మిల్లర్ 20, బెహర్డియన్ 10, ఎక్స్‌ట్రాల రూపంలో 16 పరుగులు వచ్చాయి. దీంతో సఫారీ జట్టు 408 పరుగులు సాధించింది. సఫారీ కెప్టెన్.. కెప్టెన్ ఇంన్నింగ్స్ ఆడాడు. కేవలం 66 బంతులను ఎదుర్కొని 8 సిక్సర్లు, 17 ఫోర్ల సాయంతో 162 పరుగులు చేశాడు. వెస్టిండీస్ బౌలర్లలో గేల్, రస్సెల్‌లు రెండేసి వికెట్లు చొప్పున తీయగా, హోల్డర్ ఒక వికెట్ తీశాడు.
 
ఆ తర్వాత 409 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కరేబియన్లు.. 151 పరుగులకే చేతులెత్తేశారు. ఆ జట్టు డాషింగ్ ఓపెనర్ క్రిస్ గేల్ తన వ్యక్తిగత స్కోరు 3 పరుగుల వద్ద డకౌట్ కావడంతో మిగిలిన బ్యాట్స్‌మెన్లు కూడా పెవిలియన్‌కు వరుసగా క్యూ కట్టారు. దీంతో విండీస్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 72 పరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టు ఓపెనర్ స్మిత్ (31), కార్ట్ (10)లు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. 
 
మిగిలిన బ్యాట్స్‌మెన్స్ అంతా సింగిల్ డిజిట్‌కు పరిమితం కాగా, శ్యామ్యూల్స్, సిమ్మన్స్, రస్సెల్‌‍లు డకౌట్ అయ్యారు. చివర్లో హోల్డర్ కాస్త ప్రతిఘటించి 48 బంతుల్లో నాలుగు సిక్స్‌లు, మూడు ఫోర్ల సాయంతో 56 పరుగులు చేయగా, టేలర్ 15 పరుగులు చేయగా, ఎక్స్‌ట్రాల రూపంలో 8 పరుగులు వచ్చాయి. సఫారీ బౌలర్లలో ఇమ్రాన్ తాహీర్ ఐదు వికెట్లు తీయగా, అబ్బాట్, మోర్కెల్‌లు రెండేసి వికెట్లు, స్టెయిన్ ఒక వికెట్ తీశాడు.